రూ.70 లక్షల ఆదాయానికి రూ.100కోట్ల ఆస్తులు
ఇప్పుడు చెబుతున్నదంతా ఈ మధ్యన ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన హైదరాబాద్ ఇరిగేషన్ డివిజన్ 1 ఏఈఈ హీరూర్ నిఖేశ్ కుమార్ గురించి.
అతడేం ఉన్నతాధికారి కాదు. కాకుంటే.. కీలకమైన అనుమతులు ఇచ్చే పోస్టులో అతగాడి ఉద్యోగం. అతడి నికర ఆదాయం మొత్తం లెక్క కలిపితే రూ.70 లక్షలు మాత్రమే. కానీ.. సాదాసీదా కుటుంబానికి చెందిన అతడి ప్రస్తుత ఆస్తులు (ఏసీబీ గుర్తించిన) విలువ ఏకంగా రూ.100 కోట్లకు పైనే. పదకొండేళ్ల కాలంలో ఇతగాడు కూడబెట్టిన ఈ మొత్తం ఇప్పుడు అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్రమాస్తుల్ని ఇంత భారీగా పోగేసిన వైనం అధికార వర్గాల్లో చర్చకు తెర తీసింది. ఇప్పుడు చెబుతున్నదంతా ఈ మధ్యన ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన హైదరాబాద్ ఇరిగేషన్ డివిజన్ 1 ఏఈఈ హీరూర్ నిఖేశ్ కుమార్ గురించి.
2013లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి గత నెల 30న అరెస్టు అయ్యే వరకు ఆయన ఆదాయ.. వ్యయాల్ని లెక్క కట్టారు. ఉద్యోగ వేతనంతో పాటు ఇతర మార్గాల నుంచి రూ.కోటి వరకు సమకూరినట్లుగా తేల్చారు. పదకొండేళ్ల కాలంలో కుటుంబ వ్యయం రూ.30 లక్షలుగా గుర్తించారు. ఆయన నికర ఆదాయం కేవలం రూ.70 లక్షలు ఉండగా.. ఆయన వద్ద సుమారు రూ.17.73 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా తేలింది. ఇక్కడ షాకింగ్ అంశం ఏమంటే.. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉండటం.
ఇతడికి సంబంధించిన ఎనిమిది లాకర్లను గుర్తించిన అధికారులు ఇంకేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అతడికి సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఇంకేమైనా ఉన్నాయా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక.. ఇతగాడి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన నిఖేశ్ తండ్రి ఒక చిన్నవ్యాపారి. తల్లి గతంలో వీఆర్వోగా పని చేసి ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. 2013 సెప్టెంబరు2న ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా నియమితుడైన నిఖేశ్.. 2021 ఏప్రిల్ 9 వరకు తాండూరు ఈఈ ఆఫీసులో పని చేశారు.
ఆ తర్వాత హైదరాబాద్ డివిజన్ నెంబరు 1కు బదిలీ అయ్యారు. గత మేలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఈ పోస్టులో ఉన్నప్పుడే.. బడా వ్యాపారులు.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అక్రమంగా నిరభ్యంతర పత్రాల్ని సమర్పించటంతో పాటు కోట్లల్లో అక్రమార్జనకు పాల్పడినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఉన్నతాధికారుల తరఫు కూడా అతడే లంచాలు వసూలు చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. దీనిపైనా ఏసీబీ అధికారులు ఫోకస్ చేయటం గమనార్హం.