డీజీపీకి లేఖ రాసిన హరిరామ జోగయ్య.. మనీ మ్యాటర్!
ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకి లేఖ రాశారు హరిరామ జోగయ్య.
ఏపీ రాజకీయాల్లో, పైగా ఇటీవల ఎన్నికల సమయంలో బాగా వినిపించిన పేర్లలో హరిరామ జోగయ్య ఒకరు. కాపు సామాజికవర్గ నాయకుడిగా ఆయన జనసేన అధినేత పవన్ కు ఎన్నో లేఖలు రాశారు. ప్రధానంగా సీట్ల విషయం నుంచి సీఎం పదవి షేరింగ్ వరకూ లేఖల్లో ఎన్నో సూచనలు చేశారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకి లేఖ రాశారు హరిరామ జోగయ్య.
అవును... మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావుకి లేఖ రాశారు. ఈ మేరకు తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారాని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకొవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో... మరోసారి వార్తల్లో నిలిచారు జోగయ్య. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు ఓ అగంతకుడు ఫోన్స్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో... గతంలోనూ సదరు వ్యక్తి ఇలాంటి పనులే చేసేవాడని.. దీంతో ఆరునెలల క్రితం పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, దీంతో ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులకు ఫోన్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ ఆగంతకుడిపై చర్యలు తీసుకోవాలి నేరుగా డీజీపిని కోరారు.
అయితే... హరిరామ జోగయ్య పేరుతో వచ్చిన కాల్స్ తో మోసపోయి డబ్బులు పంపిన వారి జాబితాలో తెలంగాణ సీనియర్ పొలిటీషియన్ జానారెడ్డి, కామినేని శ్రీనివాస్, మోత్కుపల్లి నరసింహులు, వి. హనుమంత రావు, కొత్తపల్లి సుబ్బారాయుడు మొదలైన వారు ఉన్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ అగంతకుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు జోగయ్య.