ఆన్‌లైన్ ట్రేడింగ్.. హైటెక్ చీటింగ్.. రెచిపోతున్న సైబర్ నేరగాళ్లు

అయితే.. సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు తాజాగా కొన్ని సూచనలు చేశారు. మోసపోతే 24 గంటల్లోనే పోలీసులను ఆశ్రయించాలని, అలా అయితే ఎంతో కొంత రికవరీ చేయొచ్చని చెబుతున్నారు.

Update: 2024-09-23 20:30 GMT

నగరాల్లో ఇప్పుడు దొంగతనాలు, దోపిడీల కంటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సైబర్ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలో తమ మోసాలకు తెరతీస్తున్నారు. బయట ఎవరికీ సాధ్యంకాని విధంగా అత్యాధునికంగా టెక్నాలజీని వాడుతూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటి బారిన పడి మోసపోతూనే ఉన్నారు. కోట్లాది రూపాయలు అప్పనంగా అప్పగిస్తున్నారు.

సైబర్ క్రైమ్స్‌లోనూ కొందరు నేరగాళ్లు వింతగా, కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏకంగా తాము సైబర్ క్రైమ్ పోలీసులమని, లేదంటే ఈడీ విభాగం నుంచి అంటూ కాల్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. లేదంటే ఈ-మెయిల్స్ చేస్తున్నారు. వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపుతూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటువంటి మోసాలు మరిన్ని పెరిగాయి. సగటును రోజుకు పది వరకు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిత్యం సైబర్ క్రైమ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకొని ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ చెప్పి వసూళ్లకు పాల్పడుతుండడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఎవరికైనా తాము సీబీఐ నుంచి, ఈడీ లేదా ఎన్ఐఏ నుంచి ఫోన్ చేస్తున్నామంటే అవతలి వ్యక్తి భయపడుతారు. దాంతో ఫోన్‌లో సైబర్ మోసగాళ్లు అడిగిన వివరాలన్నింటినీ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా అప్పటికే వాళ్ల వివరాలన్నింటిని సేకరించి పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులు డ్రా చేసుకోగలుగుతున్నారు. ఆధార్, పాన్ నంబర్ కూడా చెబుతూ.. ఇంటి అడ్రస్‌ను కూడా చెప్పడంతో సరెండర్ అవుతున్నారు. నిందితులు ఢిల్లీ, ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. లేదంటే.. మీ పేరిట పర్సల్ వచ్చిందని, అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్, మత్తు పదార్థాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారు.

ఇలానే.. హైదరాబాద్ శివారు ఏరియాకు చెందిన ఓ బాధితుడికి ఈడీ విభాగం నుంచి అని చెప్పి ఫోన్ చేశారు. దాంతో నమ్మిన ఆ బాధితుడు అడిగిన వివరాలన్నింటినీ ఇచ్చి రూ.40 లక్షలు మోసపోయాడు. 3 నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. మరికొంత మంది వృద్ధులైతే ఈ పోలీసుల చుట్టూ తిరగలేక.. ఆ కేసులను ఎదుర్కోలేక పోయిన డబ్బులను తలచుకుంటూనే ఏడుస్తున్నారు. ఇక మరికొందరైతే న్యూడ్ కాల్స్ చేస్తూ మరో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. అయితే.. సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు తాజాగా కొన్ని సూచనలు చేశారు. మోసపోతే 24 గంటల్లోనే పోలీసులను ఆశ్రయించాలని, అలా అయితే ఎంతో కొంత రికవరీ చేయొచ్చని చెబుతున్నారు. 24 గంటల్లో అయితే నేరానికి పాల్పడిన వారిని ట్రేస్ అవుట్ చేసే అవకాశాలూ ఉన్నాయని సూచిస్తున్నారు.

Tags:    

Similar News