తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఉత్కంఠ.. హైకమాండ్ ఆశీస్సులు ఎవరికో..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ మరోసారి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

Update: 2024-10-14 14:30 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ మరోసారి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలంటూ కిషన్ రెడ్డి రెక్వెస్ట్ పెట్టుకోవడంతో ఈసారి అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా బీసీ నేతను నియమించింది. దాంతో బీజేపీ కూడా బీసీ నేతనే పార్టీ చీఫ్‌గా నియమిస్తుందనే ప్రచారం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీ నేతకే దక్కబోతోందన్న ప్రచారం మరింత ఊపందుకుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి బీజేపీకి రాష్ట్రంలో లభించిన ఆదరణ నామమాత్రం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో బీజేపీ సపోర్టుగా నిలిచినప్పటికీ పెద్దగా ఆ పార్టీకి మైలేజీ రాలేదు. అనంతరం బండి సంజయ్‌ని నమ్ముకొని ఆ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు. దాంతో వచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. నగరాల వరకే పరిమితం అయిన పార్టీని గల్లీ వరకు చేర్చారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా పార్టీ జెండాలు కనిపించాయి.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏడాది వరకు కూడా సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. దాంతో పార్టీకి రాష్ట్రంలో వచ్చిన ఈమేజీ అంతాఇంతా కాదు. ఒకానొక సందర్భంలో పదేళ్లుగా రాష్ట్రంలో కొలువుదీరిన బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే టాక్ నడిచింది. పరిస్థితులు కూడా అలానే మారిపోయాయి. దాంతో ఈ సారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. ఊహించని విధంగా అధిష్టానం బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఖంగుతిన్నారు. ఇక అప్పటి నుంచి పార్టీకి ఆదరణ తగ్గింది. ఇదే విషయాన్ని అధిష్టానం గ్రహించింది. సంజయ్‌ని తొలగించకుంటే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదని పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ వెళ్లింది.

మరోవైపు.. అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేత అయినప్పటికీ ఆయనకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. ఈసారి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌కు బెర్త్ ఇచ్చారు. దీంతో ఈటలకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం ఉంది. సీనియర్ నేత కావడం.. బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పాటు కొనసాగడంతో రాష్ట్రంపై పూర్తిస్థాయిలో పట్టు ఉందని అధిష్టానం మనసులోనూ ఉన్నట్లుగా టాక్. అందుకే.. కేంద్ర కేబినెట్ లో చోటు కోరుకున్న ఈటలకు.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇస్తామని, 2028లో రాష్ట్రంలో పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడు తాజాగా ఈటలకు పోటీగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పోటీలోకి వచ్చారు. దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే నేతకే రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు వెళ్లినట్లుగా తెలిసింది.

ప్రధానంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బీజేపీలో నేతల మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. రోజుకొకరి చొప్పున లిస్టు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈటల, బండి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా ఆ జాబితాలో మరికొందరు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ నావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత మంది పోటీ మధ్య అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కబోతున్నాయని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈనెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News