వాట్ నెక్ట్స్.. కేటీఆర్‌కు హైకోర్టు షాక్.. ఏసీబీ దూకుడు
ఇన్ని రోజులుగా హైకోర్టు తీర్పుపైనే నమ్మకం పెట్టుకున్న కేటీఆర్‌కు ఈ రోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో తదుపరి ఆయన ఏం చేయబోతున్నారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇన్ని రోజులుగా హైకోర్టు తీర్పుపైనే నమ్మకం పెట్టుకున్న కేటీఆర్‌కు ఈ రోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గత నెల 31న ఇరువైపులా వాదనలు ముగించగా.. నేడు హైకోర్టు తీర్పునిచ్చింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా పది రోజుల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాళ్లన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది.
గతంలో ఇరువురి మధ్య వాదనలు హోరాహోరీగా వినిపించారు. కేసుకు సంబంధించిన పలు అంశాలను పేర్కొన్న ఏసీబీ.. నిబంధనలకు విరుద్ధంగా డబ్బును చెల్లించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందు వల్లే ఆయనపై కేసు నమోదు చేశామని ఏసీబీ వెల్లడించింది. విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో చెల్లించారని, ఇందులో ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని.. కానీ.. ఎలాంటి అనుమతి లేకుండానే రూ.54 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
కాగా.. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్‌కు వర్తించవని తెలిపారు. ఫార్ములా- ఈ కార్ల రేసు నిర్వహణ ఒప్పందంపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సంతకం చేసినట్లు తెలిపారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చడం తగదని పేర్కొన్నారు. కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని వాదించారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు సైతం ఎక్కడా చూపించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు.
ఆ సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న దాన కిషోర్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. మంత్రి పర్యవేక్షణలోనే పురపాలక శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తారని, రేసింగుకు చెల్లింపుల ఫైల్‌ను అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారని తెలిపారు. ఆ క్రమంలో అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా.. కీలక తీర్పును ఇచ్చింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పునివ్వడంతో కేటీఆర్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. మరోవైపు.. హైకోర్టు తీర్పు రాగానే ఏసీబీ దూకుడు పెంచేసింది. ఫార్ములా ఈ -రేసు కేసులో పలుచోట్ల సోదాలు చేయడం ప్రారంభించింది. గ్రీన్ కో ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. అటు ఏస్ జెన్‌నెక్ట్స్ కంపెనీలనూ సోదాలు జరుగుతున్నాయి.
మరోవైపు.. కేటీఆర్ ఈడీ విచారణకు సైతం హాజరుకావాల్సి ఉంది. కానీ.. హైకోర్టులో తీర్పు పెండింగులో ఉండడంతో తాను రాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ మరో తేదీని నిర్ణయిస్తామంటూ పేర్కొంది. ఇప్పుడు హైకోర్టు తీర్పు రావడంతో ఈడీ మరోసారి నోటీసులు జార చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో కేటీఆర్ తదుపరి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్నిరోజులుగా హైకోర్టు తీర్పుపైనే ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆయనకు.. ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పార్టీ కేడర్ కూడా ఒక్కసారిగా ఖంగుతింది. ఈ క్రమంలో కేటీఆర్ ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తన లీగల్ టీంతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.