బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాలపై హైకోర్టులో పిల్!

జనవరి 10న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, 12న నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-01-07 11:53 GMT

సంక్రాంతి సీజన్ అంటే సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద పండుగ అని చెబుతారు. ఈ సీజన్ లో ప్రతీ ఏటా భారీ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలో ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయని అంటున్నారు. ఈ సంక్రాంతికి బాలయ్య బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమనే కామెంట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయని చెబుతున్నారు.

మరోపక్క అంతకంటే ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం “గేమ్ ఛేంజర్” కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ మేరకు జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలా.. జనవరి 10న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, 12న నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ సినిమాలకు సంబంధించి టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.

అవును... సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్”, బాలకృష్ణ “డాకు మహరాజ్” సినిమాల టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇలా ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం అని పిటిషనర్ పేర్కొన్నారు!

అందువల్ల.. ఈ రెండు సినిమాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వ్యులను రద్దూ చేయాలని పిటిషనర్ కోరారు! ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల టీమ్ లను చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో... ఈ పిల్ పై హైకోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News