పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు సారాంశం ఏంటి?

ఒకవేళ తాము చెప్పినట్లుగా నాలుగు వారాల వ్యవధిలో స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోకుంటే.. ఈ అంశంపై తాము సుమోటోగా కేసును స్వీకరించి విచారిస్తామని స్పష్టం చేసింది.

Update: 2024-09-09 14:34 GMT

తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోర్టు తీర్పు ఈ రోజు రావటం తెలిసిందే. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తాజాగా హైకోర్టు రియాక్టు అయ్యింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోపు నిర్ణయాన్ని తీసుకోవాలని పేర్కొంది.

ఒకవేళ తాము చెప్పినట్లుగా నాలుగు వారాల వ్యవధిలో స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోకుంటే.. ఈ అంశంపై తాము సుమోటోగా కేసును స్వీకరించి విచారిస్తామని స్పష్టం చేసింది. ఇంతకూ ఈ తీర్పు వెనుక వేసిన పిటిషన్ ఉద్దేశం ఏమిటి? ఏ నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది? అన్న విషయంలోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. ఒక పార్టీ తరఫున గెలుపొందిన తర్వాత.. అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల తీరును తప్పు పడుతూ.. బీఆర్ఎస్.. బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ తరఫు గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కాంగ్రెస్ తో జత కట్టారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉన్న శ్రీహరి.. తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి.. వివేకానందగౌడ్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు.

వేర్వేరుగా వేసిన ఈ పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు పేర్కొంటూ.. కలిపి విచారణను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని స్పీకర్ పట్టించుకోవటం లేదంటూ పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ ఆదేశాలుజారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన ఇద్దరి సంగతి ఎలా ఉన్నా.. దానం విషయంలో మాత్రం చిక్కులు తప్పవంటున్నారు.

పార్టీ మారిన మిగిలిన ముగ్గురితో పోలిస్తే.. దానం ఇటీవల జరిగిన లోక్ సభా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన పార్టీ మార్పు విషయంలో స్పీకర్ కచ్ఛితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. మొత్తంగా అటు తిరిగి.. ఇటు తిరిగి దానం నాగేందర్ కు చిక్కులు తప్పవని.. అనర్హత వేటుకు అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News