అక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక...ఈసీ డెసిషన్ పై హాట్ డిస్కషన్
దాంతో వైసీపీకి ఉప ఎన్నిక జరగకపోతే రాజకీయంగా షాక్ తగిలినట్లే అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎపుడూ ఇలాంటి సమస్య ఎక్కడా ఉత్పన్నం కాలేదని అంటున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఈ నెల 4న జారీ చేసింది. దీని కంటే ముందు ఎన్నికల షెడ్యూల్ ని కూడా ఈ నెల 3న విడుదల చేసింది. ఒక వైపు నామినేషన్ల ఘట్టం మొదలైంది. వైసీపీ తన అభ్యర్థిగా బొబ్బిలికి చెందిన మాజీ ఎమ్మెల్సీ శంబంగి చిన అప్పలనాయుడుకి ప్రకటించింది. ఆయన గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు.
ఈ ఎన్నికకు సంబంధించి ఇదొక్కటే ఇప్పటిదాకా వచ్చిన నామినేషన్. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. వైసీపీ తరఫున ఈ సీటుకు ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు మీద అనర్హత వేటు వేస్తూ శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు నిర్ణయం తీసుకున్నారు.
ఆ మీదట ఈ సీటు ఖాళీ అయిందని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఈ సీటుకు ఉప ఎన్నిక జరిపిస్తోంది. అయితే తన మీద వేసిన అనర్హత వేటును రద్దు చేయాలని ఇందుకూరి రఘురాజు కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు లేటెస్ట్ గా దీని మీద తీర్పు వెలువరించింది.
ఇందుకూరి రఘురాజు మీద అనర్హత వేటు చేల్లదని తీర్పు ఇచ్చింది. దాంతో రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నట్లు అయింది. దీంతో ఇపుడు అసలైన ఇరకాటం ఏర్పడుతోంది. ఒక వైపు కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఉప ఎన్నికను నిర్వహిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నెల 28 ఎన్నికకు అంతా సిద్ధం చేశారు.
ఇపుడు హైకోర్టు రఘురాజు మీద అనర్హత వేటుకు రద్దు చేయడంతో ఆయన ఎమ్మెల్సీగానే ఉంటారు. మరి ఎమ్మెల్సీగా ఆయనే కొనసాగుతున్నపుడు ఎన్నికలు ఎందుకు అన్నది ఒక చర్చగా ఉంది. మరో వైపు చూస్తే హై కోర్టు ఈ విషయంలో విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే రఘు రాజు మీద ఎందుకు అనర్హత వేటు వేస్తున్నారు చెబుతూ ఆయన నుంచి వివరణ తీసుకోవాలని కోర్టు శాసన మండలి చైర్మన్ కి సూచించింది అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చూస్తే కనుక ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది ఇపుడు హాట్ డిస్కషన్ గా మారింది. ఎందుకు అంటే ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చిన ఈసీ ఇపుడు ఎలా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. రెండూ రాజ్యాంగబద్ధమైన సంస్థలే కావడం విశేషం. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చాక ఈసీ ఎన్నికలను ఆపుతుందా అన్నది చర్చగా ఉంది.
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికైనా శిరోధార్యమే అని అంటున్నారు. దాంతో అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. హైకోర్టు తీర్పు మీద ఈసీ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అదే జరిగితే ఉప ఎన్నిక లేనట్లే. ఉప ఎన్నిక లేకపోతే టీడీపీ కూటమి వైపు వచ్చిన ఇందుకూరి రఘురాజుకే లాభం. ఆ విధంగా వైసీపీకి రాజకీయంగా దెబ్బ పడినట్లే అంటున్నారు.
ఎందుకు అంటే తమ పార్టీని ధిక్కరించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి సహకరించారు అన్న కారణం చేతనే ఆఘమేఘాల మీద ఆయన మీద వేటు వేయించారు. అయితే ఈ హడావుడిలో ఆయన నుంచి వివరణ తీసుకోవాలన్న నిబంధనను పక్కన పెట్టేశారు అని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకుని రఘురాజు కోర్టుకు వెళ్ళి తన పదవిని కాపాడుకున్నారు.
దాంతో వైసీపీకి ఉప ఎన్నిక జరగకపోతే రాజకీయంగా షాక్ తగిలినట్లే అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎపుడూ ఇలాంటి సమస్య ఎక్కడా ఉత్పన్నం కాలేదని అంటున్నారు. హైకోర్టు తీర్పు నేపధ్యంలో అందరి చూపూ ఇపుడు ఈసీ డెసిషన్ మీదనే ఉన్నాయని అంటున్నారు.