ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని పేర్కొంది.

Update: 2023-09-16 11:16 GMT

సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోలుస్తూ దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీసిన సంగతి తెలిసిందే.

ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంస్థలు, సంఘాలు, పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యకు చెందిన పరంధాస్‌ ఆచార్య అనే స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కలకలం రేపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లోనూ జన జాగరణ సమితి.. ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించింది.

మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ తదితరులు పరోక్షంగా ధ్వజమెత్తారు. ఇండియా కూటమిలోని ఆప్, తృణమూల్‌ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌) తదితరులు మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించాయి.

మరోవైపు ఈ స్థాయిలో తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్‌ చెబుతున్నారు. తనపైన కేసులు వేసుకున్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని అంటున్నారు. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్‌ వంటివారు ఎప్పుడో చెప్పారంటూ తన వ్యాఖ్యలను ఉదయనిధి సమర్థించుకుంటుండటం గమనార్హం.

ఈ క్రమంలో మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని పేర్కొంది. "సనాతన ధర్మంపై వ్యతిరేకత" అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటూ ఓ కళాశాల ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో కొద్ది రోజుల క్రితం పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. శేషసాయి హాట్‌ కామెంట్స్‌ చేశారు. సనాతన ధర్మం అంశం చుట్టూ జరుగుతోన్న చర్చపై ఆందోళన వ్యక్తం చేశారు.

అంటరానితనం సహించలేనిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిర్మూలించినట్లు పేర్కొందని గుర్తు చేశారు. అంటరానితనానికి దేశంలో స్థానం లేదని తెలిపారు. అలాగే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాథమిక హక్కేనని వెల్లడించారు. అయితే భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదన్నారు. మరీ ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని.. అంతమాత్రాన ఎలా పడితే అలా వ్యాఖ్యానించడం సరికాదని కోర్టు పేర్కొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మతానికి సంబంధించి విషయాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోర్టు హెచ్చరించేనట్టేనని అంటున్నారు.

Tags:    

Similar News