సీఎం కేసీఆర్ పోటీ చేసే ఆ రెండు చోట్ల అత్యధిక నామినేషన్లు

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం విజయవంతంగా పూర్తైంది.

Update: 2023-11-12 05:12 GMT

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం విజయవంతంగా పూర్తైంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కాగా.. శనివారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎన్నేసి చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న స్థానాలకు గట్టి పోటీ నెలకొని ఉండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4798 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోగా.. 5716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

రోటీన్ కు భిన్నంగా ఈ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల (గజ్వేల్, కామారెడ్డి) ఎన్నికల బరిలోకి నిలవటం తెలిసిందే. దీంతో.. ఇప్పుడు అందరి చూపు ఈ రెండు స్థానాల మీదే పడింది. తాజాగా చూసిన లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ స్థానాల్లోనే ఎక్కువ మంది పోటీ బరిలో నిలిచారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

గజ్వేల్ రాష్ట్రంలోనే అత్యధిక నామినేషన్లు దాఖలైన నియోజకవర్గంగా నిలిచింది. ఇక్కడ మొత్తం 145 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. కామారెడ్డిలో మాత్రం 92 మందికే పరిమితమయ్యారు. భారీగా నామినేషన్లు జారీ అయిన నియోజకవర్గాల్ని చూస్తే.. ప్రముఖులు బరిలో ఉన్న చోట్ల కూడా భారీగా నామినేషన్లు దాఖలు కావటం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైన నియోజకవర్గాల్ని చూస్తే..

నియోజకవర్గం దాఖలైన నామినేషన్లు

మేడ్చల్ 116

ఎల్బీ నగర్ 77

మునుగోడు 74

సూర్యాపేట 68

మిర్యాలగూడ 67

నల్గొండ 64

సిద్దిపేట 62

కోదాడ 61

ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత.. అత్యధికంగా నామినేషన్లు దాఖలైన నియోజకవర్గాల్లో మంత్రి మల్లారెడ్డి బరిలో ఉన్న మేడ్చల్ కావటం గమనార్హం. ఇంతజోరుగా నామినేషన్ల పర్వం సాగితే.. ఇందుకు భిన్నంగా నారాయణపేట్ నుంచి మాత్రం అతి తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ కేవలం 13 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేయటం గమనార్హం. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన.. 15న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీగా ఉంది. కట్ చేస్తే.. 30న కీలకమైన పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఈ నెల 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించటం తెలిసిందే. తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తుల్ని పరిష్కరించి శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205కు పెరిగింది. అందులో పురుష ఓటర్లు 1,62,98,418 మంది కాగా మహిళా ఓటర్లు 1,63,01,705గా పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లుగా 2676 మంది నమోదు చేసుకున్నారు. తొలిసారి ఓటర్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News