పోలింగ్ ని ఎండలు మింగేస్తున్నాయా ?

ఇప్పటికి రెండు విడతలుగా దేశంలో పోలింగ్ జరిగింది. దాదాపుగా రెండు వందల ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయింది.

Update: 2024-04-27 03:42 GMT

ఇప్పటికి రెండు విడతలుగా దేశంలో పోలింగ్ జరిగింది. దాదాపుగా రెండు వందల ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయింది. అంటే మొత్తం 543 లోక్ సభ సీట్లలో నలభై శాతం దాకా అనుకోవచ్చు. మొదటి విడత పోలింగ్ లో 66 శాతంగా నమోదు అయితే రెండవ విడత పోలింగ్ లో 63 శాతం పైగా అని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సాగుతోంది.

ఎన్నికలు అంటే జనాలకు ఇష్టం లేదా లేక ఎవరు వచ్చినా ఓకే అని భావిస్తున్నారా అన్న దాని మీద డిబేట్ సాగుతోంది. ఇక నాయకులు వారి ప్రసంగాలు జనాలను పోలింగ్ బూతుల దాకా రప్పించలేకపోతున్నారా అన్న దాని మీద కూడా చర్చించుకుంటున్నారు.

దేశంలో చూస్తే ఇండియా కూటమి ఉంది దానికి నాయకుడు లేదు. రాహుల్ గాంధీ ఉన్నా అంతా అంగీకరించి ప్రధాని అభ్యర్ధిని డిసైడ్ చేసుకోలేదు. దాంతో ప్రధాని అభ్యర్ధి లేకుండా ఇండియా కూటమి వెళ్తోంది. దాని ప్రభావం కొన్ని చోట్ల బలంగా ఉంటే కొన్ని చోట్ల వీక్ గా ఉంది. ఇక దక్షిణాదిన చూస్తే ఇండియా కూటమి ఏపీ తప్ప మిగిలిన చోట్ల బలంగా ఉంది.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి తీరు చూస్తే ప్రధాని అభ్యర్ధిగా మూడవసారి కూడా నరేంద్ర మోడీయే ఉన్నారు. ఆయన ఇమేజ్ అంతకంతకు పెరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నా జనాలకు కొత్త ముఖం కావాలన్న ఫీలింగ్ ఉందేమో అన్న డౌట్లు ఉన్నాయి. 2014లో కడలి తరంగంలా ఎగిసిన మోడీ పదేళ్ల కాలంలో బోర్ కొడుతున్నారా అన్న చర్చ నడుస్తోంది.

ఇక ఇండియా కూటమి అయినా ఎన్డీయే కూటమి అయినా ఎవరు వచ్చినా ఒరిగేది ఏమీలేదు అన్న ఆలోచనలు జనాలకు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే ఎండలు మండించేస్తున్నాయి.ఎపుడూ ఇంత ఎండలు లేవు. ఈసారి ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యంగా వచ్చింది. మే నెల అంతా ఎన్నికలే ఉన్నాయి.

మొదటి రెండు విడతలు ఏప్రిల్ నెలలో జరిగితేనే ఎండ ధాటీగా ఉంది. తట్టుకోలేక జనాలు పోలింగ్ బూతులకు రావడం లేదు అని అంటున్నారు. ఇక మే నెలలో మరో నాలుగు విడతల ఎన్నికలు ఉన్నాయి. వీటి సంగతేంటి, వీటి పోలింగ్ శాతం ఎంత నమోదు అవుతుంది అన్న బెంగ అయితే పట్టుకుంది.

ఇక ఓటర్లు తక్కువగా వస్తే పోలింగ్ తక్కువగా నమోదు అయితే అది అధికార పార్టీకి లాభమా అన్న కోణంలో నుంచి చర్చ సాగుతోంది. ఉన్న ప్రభుత్వం మీద వెల్లువలా వ్యతిరేకత లేకపోతే ఇంటి నుంచి జనాలు రారు అన్న ఓల్డ్ థియరీని కూడా రాజకీయ విశ్లేషకులు కొందరు వల్లె వేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈసారి ఎండలు ధాటిగా ఉన్నాయి. మండు వేసవి భారీ పోలింగ్ జరగకుండా సాలిడ్ గా మింగేస్తోందా అన్న డౌట్లు వస్తున్నాయి.

ఈ రకంగా చప్ప చప్పగా పోలింగ్ జరిగితే మాత్రం ఇబ్బందికరమే అంటున్నారు ఎందుకంటే 2019లో తొలి విడత పోలింగ్ దాదాపుగా డెబ్బై శాతం జరిగిత్రే రెండవ విడత డెబ్బై ఒకటిగా సాగింది.ఓవరాల్ గా ఏడు దశల పోలింగ్ డెబ్బై అయిదు దాకా నమోదు అయింది. ఈసారి ఏకంగా ఎనభై శాతం టార్గెట్ పెట్టుకుంటే అది కాస్తా ఏ అరవై అయిదు శాతం దగ్గరో ఆగిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News