'ఓ సీఎం - కొన్ని సమోసాలు - సీఐడీ దర్యాప్తు'... సుఖాంతం ఇలా!
దీంతో... సీఐడీ బాస్ సీరియస్ అవ్వగా... "నేనొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేనొచ్చిన కార్యక్రమంలో నాకు సమోసాలు పెట్టకుండా ఇబ్బంది పెడతారా?" అన్న స్థాయిలో సీఎం సీరియస్ అయ్యారని అంటున్నారు!
ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి స్నాక్స్ సమయంలో సమోసాలు పెట్టలేదని సాక్ష్యాత్తు ఆయనే సీరియస్ అయ్యారని.. దీనిపై సీఐడీ చీఫ్ కూడా సీరియస్ అయ్యారని.. దీనిపై దరాప్తుకు ఆదేశించారనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది! అయితే... ఈ వ్యవహారంపై తాజాగా సీఎం స్పందించడంతో.. సుఖాంతం అయ్యిందని అంటున్నారు!
అసలేం జరిగిందంటే...?
దేశానికి రాజైనా తల్లికి కొడుకే.. స్వర్ణ సింహాసనంపై కుర్చున్నా సమయానికి కడుపుకు ఆకలే అంటారు. అంటే... కొడుకు ఎంత గొప్పవాడైనా.. ఆమె దృష్టిలో ఇంకా చిన్నపిల్లాడే అని కాగా... ఒక వ్యక్తి ఎంత గొప్పోడైనా ఆకలి ముందు అందరితోనూ సమానమే అని అర్ధం! తాజాగా ఓ సీఎం విషయంలో ఇది మరోసారి రుజువైంది!
అవును... ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి, సీఐడీ చీఫ్ తో పాటు పలువురు అధికారులకు స్నేక్స్ గా సమోసాలు అందలేదంట. దీంతో... సీఐడీ బాస్ సీరియస్ అవ్వగా... "నేనొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేనొచ్చిన కార్యక్రమంలో నాకు సమోసాలు పెట్టకుండా ఇబ్బంది పెడతారా?" అన్న స్థాయిలో సీఎం సీరియస్ అయ్యారని అంటున్నారు!
కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే... గత నెల 21న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు.. సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ను ప్రారంభించేందుకు వెళ్లారంట. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాలా సమయం ఉండి పాల్గొన్నారంట!
ఈ సమయంలో... సీఎం రాక నేపథ్యంలో "సీఎం వస్తున్నారు.. వెంటనే స్నాక్స్ ఏర్పాటు చేయండి" అని ఓ ఎస్సైని ఐజీ ర్యాంక్ అధికారి ఆదేశించారంట. దీంతో.. సమోసాలు తీసుకురమ్మని.. తన సబార్డినేట్స్ కి సూచించారంట సదరు ఎస్సై. దీంతో వారు స్థానిక బజార్ లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు బాక్సులలో సమోసాలు తీసుకొచ్చారట.
ఈ సమయంలో అక్కడే ఉన్న మహిళా పోలీసుకు... తెచ్చిన సమోసాలు పెట్టమని సూచించారంట. అయితే... ఆ మహిళా ఎస్సై.. సమోసాలు సీఎం కోసం తెచ్చారనే విషయం తెలియక.. సీఎం స్టాఫ్ లో ఓ విభాగం వారికి పంచారంట. దీంతో... మీటింగ్ అయిపోయినా కూడా తమకు స్నాక్స్ అందకపోవడంతో సీఎంతో పాటు సీఐడీ చీఫ్ కూడా ఆకలితో వెనుదిరగాల్సి వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే... అధికారుల వద్ద సీఎం, స్టాఫ్ వద్ద సీఐడీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. అంతేకాదండోయ్... ఈ వ్యవహారంలో ప్రోటోకాల్ పాటించలేదనో ఏమో కానీ... విచారణకు ఆదేశాలు జారీ చేశారట! దీంతో... ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే... ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర విమర్శలకు, నెట్టింట వ్యంగ్యాస్త్రాలకు కారణమైన వేళ సదరు సీఎం స్పందించారు! ఇందులో భాగంగా... హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు మాట్లాడుతు... అలాంటిదేమీ లేదని.. అది (సీఐడీ) దురుసుగా ప్రవర్తించే అంశంలో చిక్కుకుందని.. కానీ మీడియా సమోసాల గురించి వార్తలు నడుపుతున్నారని అన్నారు.
మరోపక్క ఈ విషయాలపై హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ... ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ వ్యవహారంలో ఎటువంటి విచారణను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈవెంట్ కోసం ఆర్డర్ చెసిన స్నాక్స్ బాక్సులు ఎక్కడ ఉన్నాయనేది అడగడం చాలా సాధారణ విషయమని.. దీనిపై ఎలాంటి దర్యాప్తు ప్రారంభించలేదని అన్నారు.