'భారతరత్నం' రతన్ టాటా ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలుసా?

రతన్ టాటా ముత్తాత జంషెట్ టాటా నుంచి ఈ వంశ వృక్షాన్ని పరిశీలిద్దాం.!

Update: 2024-10-10 19:30 GMT

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపుకు చెందిన ఫ్యామిలీలో అత్యంత ప్రతిభావంతులైన వారిలో ఒకరు రతన్ టాటా. ఈయన 86 ఏళ్ల వయసులో అక్టోబర్ 9న ముంబైలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. రతన్ టాటా ఓ గొప్ప వ్యాపారవేత్తే కాదు.. బాధ్యత గల పౌరుడు కూడా!

పొద్దున్న లేస్తే ‘భారత్ మాతా కీ జై’ అని మైకుల ముందు, సభల్లోనూ చెబుతూ పాకిస్థాన్ లోనూ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారని చెప్పే ఈ రోజుల్లో.. దేశం కోసం పాక్ వంటి దేశంతో వ్యాపార బంధాన్ని తెంచుకున్న గొప్ప దేశభక్తుడు రతన్ టాటా! ఒక్క మాటలో చెప్పాలంటే... కష్టపడితే కుబేరులు కావొచ్చు కానీ.. రతన్ టాటా లా ఐశ్వర్యవంతుడు కాలేరని అంటారు.

అవును... అవును కోహినూరు వజ్రం వంటి క్యారెక్టర్, నిలువెత్తు నిజాయతీ, ధైర్యశాలి, ధీశాలి, మనసున్న మారాజు, అసలు సిసలు భారతరత్నం రతన్ టాటా. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ గురించి, టాటా వంశవృక్షం గురించి తెలుసుకుందాం...!

రతన్ టాటా ముత్తాత జంషెట్ టాటా నుంచి ఈ వంశ వృక్షాన్ని పరిశీలిద్దాం.!

* జంషెట్ నవసారిలోని పార్సీ కుటుంబంలో జన్మించిన జంషెట్ టాటా.. 1868లో భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థ టాటా గ్రూపు ను జంషెట్ పూర్ లో స్థాపించారు. అనంతరం ముంబైలో ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించారు.

* ఈ క్రమంలో.. హీరాబాయి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు దొరభ్ జీ టాటా, రతన్ జీ టాటా. వీరిలో దోరభ్ జీ టాటా పెద్ద వ్యాపారవేత్తగా మారారు. ఈయన 1904 - 1928 మధ్య టాటా గ్రూపుకు ఛైర్మన్ గా ఉన్నారు.

* ఆయన 1896లో మొహర్ బాయిని వివాహం చేసుకున్నారు. అయితే... ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇక జంషెట్ టాటా రెండో కుమారుడు, రతన్ టాటా తాత రతన్ జీ టాటా... తన అన్న దోరభ్ జీ టాటా తర్వాత 1928 నుంచి 1932 వరకూ టాటా గ్రూపుకు ఛైర్మన్ గా ఉన్నారు.

* ఈయన 1892లో సుజానీ అనే ఫ్రెంచ్ మహిళను పెళ్లాడారు. వీరికి కూడా పిల్లలు లేరు. దీంతో ఈ దంపతులు ఓ బిడ్డను దత్తత తీసుకున్నారు. అతని పేరే నావల్ టాటా. ఈయనే రతన్ టాటా తండ్రి.

* ఇలా రతన్ జీ టాటా దత్తపుత్రుడైన నావల్ టాటా... సోనూ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.. వారి పేర్లు రతన్ టాటా, జిమ్మీ. వీరిలో రతన్ టాటా తో పాటు జిమ్మీ కూడా పెళ్లి చేసుకోలేదు.

* అయితే రతన్ టాటా చిన్నతనంలోనే ఆయన తండ్రి నావల్ టాటా - సోనీ విడాకులు తీసుకున్నారు. అప్పుడు రతన్ టాటా తన నాన్నమ్మ వద్ద పెరిగారు. విడాకుల అనంతరం రతన్ టాటా తండ్రి నావల్ టాటా.. సీమోన్ అనే స్విట్జర్లాండ్ అమ్మాయిని పెండ్లి చేసుకున్నారు.

* ఈ దంపతులకు నోయెల్ టాటా అనే కుమారుడు జన్మించాడు. అంటే... రతన్ టాటా కు నోయల్ టాటా సవతి సోదరుడన్నమాట!

* ఈ క్రమంలో... రతన్ టాటా బ్రహ్మచారిగా ఉండిపోగా... నోయెల్ టాటా.. ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పేర్లు.. నెవెల్లే టాటా, మాయా టాటా, లేయా టాటా. ఈ ముగ్గురిలో ఒకరు ఇప్పుడు రతన్ టాటా వారసులవ్వబోతున్నారని అంటున్నారు!

Tags:    

Similar News