తిరుపతి లడ్డూ పరమ పవిత్రం...శతాబ్దాల చరిత్రం

తిరుపతి లడ్డూని చూస్తేనే అందులో శ్రీవారు కనిపిస్తారు. ఎవరైనా తిరుపతి వెళ్ళి వస్తే ఆ లడ్డూని తమ సన్నిహితులకు స్నేహితులకు పంచుతారు.

Update: 2024-09-21 14:33 GMT

తిరుపతి లడ్డూని చూస్తేనే అందులో శ్రీవారు కనిపిస్తారు. ఎవరైనా తిరుపతి వెళ్ళి వస్తే ఆ లడ్డూని తమ సన్నిహితులకు స్నేహితులకు పంచుతారు. అందులో ఒక చిన్న ముక్క అయినా తీసుకుంటే తాము కూడా శ్రీవారిని దర్శించుకున్నంతగా ఆధ్యాత్మిక భావనతో ఫీల్ కావడం మొత్తం హిందువుల అత్యంత నమ్మిక.

ఇక తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం అయింది అన్న వార్తల నేపథ్యంలో ఇపుడు తిరుమల లడ్డూ గురించి అంతా చర్చించుకుంటున్నారు. కలియుగం ఆరంభం నుంచి శ్రీవారి ఆలయం ఉంది. మరి లడ్డూ ప్రసాదం ఎపుడు వచ్చింది అన్నది అందరికీ ఆశ్చర్యంతో కూడిన ఆసక్తికరమైన చర్చగానే ఉంటుంది.

ఆ వివరాలు చూస్తే కనుక మరింతగా భకిభావం పొంగి పొరలుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో భక్తుల కోసం తానుగా భువిని దిగి వచ్చిన వారు. శ్రీవారి ఆలయంలో 365 రోజుల్లో ఏకంగా 400 కి పైగా ఆధ్యాత్మిక పండుగలు జరుగుతూ ఉంటాయి అంటేనే ఎంత వేడుక అనిపించకమానదు.

ఇక శ్రీవారికి అనేక ప్రసాదాలు నైవేద్యం పెట్టినా కూడా అందులో భక్తులకు దొరికేది అందుబాటులో ఉండేది లడ్డూ ప్రసాదమే ఎక్కువగా అని చెప్పాలి. ఈ లడ్డూ ప్రసదం చరిత్ర చూస్తే క్రీస్తు శకం 614 కాలంలో పల్లవరాణి ఆలయానికి భోగ శ్రీనివాసుణ్ణి కానుకగా సమర్పించుకున్నారు అని చెబుతోంది.

అప్పట్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. అనంతరం శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం సర్వత్రా వ్యాపించింది. ఇక రెండవ దేవరాయల కాలంలో శ్రీవారికి అమాత్యుడు శేఖర మల్లన్న మూడు గ్రామాలను దానంగా ప్రకటించారు.

ఇలా వీటిపైన వచ్చే ఆదాయంతో స్వామి వారి నిత్య సేవలు నిర్వహించేవారు. మల్లన్న హయాంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టికను ఒక దానిని రూపకల్పన చేశారు అని చరిత్ర చెబుతోంది. అప్పట్లో భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం, తదితర ప్రసాదాలను స్వామికి సమర్పించేవారు.

ఇక విజయనగరం ప్రభువుల కాలంలో స్వామి వారికి అవసరం అనే ప్రసాదాన్ని నివేదన చేసేవారు అని శాసనాలు చెబుతున్నాయి. ఇక తీపి ప్రసాదాల విషయానికి వస్తే ఇప్పటికి మూడు వందల ఏళ్ళ క్రితమే స్వామివారికి తీపితో చేసిన ప్రసాదాలను అందించేవారు అని కూడా చరిత్ర చెబుతోంది.

ఇక బ్రిటిష్ వారి హయాంలో 1803 కాలంలో శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు అని కూడా చెబుతారు. ఇక అప్పట్లో వడకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. వడ ఎక్కువ రోజు నిల్వ ఉండడడమే కారణం. ఆ తరువాత మహంతుల కాలంలో తీపి బూందీని ప్రసాదంగా ఇచ్చేవారు. అలా ఆ ప్రసాదంలో మరి కొంతకాలానికి లడ్డూగా మారింది అన్నది చరిత్ర చెబుతున్న విషయం.

ఇలా చూసుకుంటే 1940లలో మిరాశీదారులలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం అన్నది ప్రారంభించారు అని చెబుతారు. అలా ఆ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటేనే లడ్డూ అన్నంతగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

శ్రీవారి లడ్డూలు చూస్తే మూడు రకాలుగా ఉంటాయి. భక్తులకు ఇచ్చేవి ప్రతీ యాభై రూపాయలు ఒక లడ్డూ అయితే కల్యాణోత్సవం లడ్డూ రెండవ రకంగా ఉంటుంది. దీని ధర 200 రూపాయలుగా ఉంటుంది. ఇక మూడవ రకం లడ్డూ పేరు ఆస్థానం. దీనిని ప్రత్యేకమైన పండుగల సమయంలో అలాగే రాష్ట్రపతి వంటి వారు తిరుమల వచ్చినపుడు తయారు చేసి ఇస్తారు. దెనై బరువు ఏకంగా 750 గ్రాములు ఉంటుంది.

లడ్డూ తయారు చేయడం అన్నీ ఒక పద్ధతి ప్రకారం కొలతల ప్రకారం ఉంటుంది. అలా వాడే పదార్ధాలలో కచ్చితత్వం ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 50 లడ్డూలు అని లెక్క. ఈ లడ్డూల తయారీలో శెనగ పిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవునేయి, కలకండ, ఎండు ద్రాక్ష తదితర పదార్ధాలను ఉపయోగిస్తారు.

ఇక ఈ లడ్డూ ప్రసాదానికి పేటెంట్ కూడా ఉంది. దీని తయారీ దానికి వెనక ఉన్న నైపుణ్యం ఒక్క టీటీడీకే సొంతం. ఎవరూ అనుసరించరాదు. కాపీ చేయరాదు. లడ్డూ ప్రసాదం 2009లో జీఐ భౌగోళిక గుర్తింపును అందుకుంది. ఇక కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదానికి సరిసాటి మరేవీ ఉండవని కూడా చెప్పాల్సి ఉంది.

అలా లడ్డూతో పాటు ప్రతీ ప్రసాదం అత్యంత రుచికరంగా శుచికరంగా పవిత్రంగా ఉంటాయి. కేవలం ప్రసాదం మాత్రమే కాదు కొండలలో ప్రవహించే నీరు తీర్ధాలు, అక్కడ ప్రకృతి ఆలయంలో నిర్వహించే పోటు అన్నీ కలిసే స్వామి వారి ప్రసాదం గొప్ప విశిష్టతను అందుకోవడానికి దోహదపడుతున్నాయి. మొత్తానికి అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన స్వామి వారు అంటేనే లడ్డూ అని వేరేగా చెప్పాల్సినది లేదు. ఆ లడ్డూ ప్రసాదానికి ఉన్న పవిత్రత మరి దేనికీ రాదు అని గట్టిగా చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News