డీప్‌ ఫేక్‌ నిన్న రష్మిక, కత్రిన.. నేడు రూ.207 కోట్లు కొట్టేశారు!

నూతన టెక్నాలజీ ప్రవేశంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అంతేస్థాయిలో కీడు కూడా జరుగుతోంది

Update: 2024-02-06 13:07 GMT

నూతన టెక్నాలజీ ప్రవేశంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అంతేస్థాయిలో కీడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల ప్రవేశించిన డీప్‌ ఫేక్‌ ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ కలవరం సృష్టిస్తోంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, కంపెనీలు దీనిబారినపడి మోసపోతున్నారు.

ఇటీవల సినీ నటి రష్మికదని చెప్పబడుతున్న ఒక అసభ్య వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే అది నిజంగా రష్మికది కాదని.. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో అలా సృష్టించారని తేలింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం కూడా జరిగిపోయాయి. అలాగే కత్రినా కైఫ్‌ వీడియో అంటూ ఒక తప్పుడు వీడియో కూడా హల్‌ చల్‌ చేసింది. ఇది కూడా డీప్‌ ఫేక్‌ సాయంతో సృష్టించేదనని తేలింది.

ఇప్పుడు డీప్‌ ఫేక్‌ బారిన పడి ఒక అంతర్జాతీయ సంస్థ ఏకంగా రూ.207 కోట్లు పోగొట్టుకుంది. ఆ సంస్థ హాంకాంగ్‌ కు చెందినదని తెలుస్తోంది. అచ్చం బ్రాంచ్‌ ఉద్యోగుల్లా వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడిన నిందితులు రూ.207 కోట్లను ట్రాన్సఫర్‌ చేయించుకున్నారు. తర్వాత వాళ్లు నిజంగా తమ కంపెనీ ఉద్యోగులు కాదని.. డీప్‌ ఫేక్‌ తో మోసం చేశారని వెల్లడి కావడంతో రూ.207 కోట్లు పంపిన బ్రాంచ్‌ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డీప్‌ ఫేక్‌ ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో దీన్ని బట్టి తెలుస్తోంది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఒక అంతర్జాతీయ సంస్థకు హాంకాంగ్‌ తోపాటు పలు దేశాల్లో శాఖలు ఉన్నాయి. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో హాంకాంగ్‌ బ్రాంచ్‌ కు చెందిన ఉద్యోగిని కొందరు మోసగాళ్లు ట్రాప్‌ చేశారు. ఫైనాన్స్‌ విభాగంలో అతడు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌ బ్రాంచ్‌ లో ఉన్న చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) నుంచి ఒక సందేశం వచ్చింది. రహస్యంగా నగదు లావాదేవీలు నిర్వహించాలని ఆ మేసేజ్‌ లో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సూచించాడు.

అయితే మరింత స్పష్టత కోసం సీఎఫ్‌వో, ఇతర సిబ్బందితోపాటు ఆ ఉద్యోగి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నాడు. ఇందులో పాల్గొన్న వ్యక్తులంతా సంస్థ ఉద్యోగుల మాదిరిగానే కనిపించాడు. తనకులానే మాట్లాడటంతో హాంకాంగ్‌ ఉద్యోగికి ఎలాంటి అనుమానం తలెత్తలేదు.

నేరగాళ్లు ఆ ఉద్యోగుల వీడియో, ఆడియో ఫుటేజీని సేకరించి డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ ద్వారా అచ్చం సంస్థ ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, మాట్లాడినట్లు సృష్టించారు.

ఈ నేపథ్యంలో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఆదేశాలకు అనుగుణంగా హాంకాంగ్‌ ఉద్యోగి ఐదు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.207 కోట్లు ట్రాన్సఫర్‌ చేశాడు. ఈ దారుణమైన మోసం గత జనవరి నెలలో జరిగిందని తెలుస్తోంది. వారం తర్వాత కానీ ఈ మోసాన్ని గుర్తించలేకపోయారు. ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనుమానించిన ఆ ఉద్యోగి లండన్‌ కార్యాలయ సిబ్బందిని సంప్రదించడంతో ఈ అతి భారీ మోసం బయటపడింది.

కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే సంస్థ పేరును మాత్రం వారు వెల్లడించలేదు.

Tags:    

Similar News