మా అమ్మాయిని ప్రేమిస్తావా.. ఇంటికి అగ్గిపెట్టేశాడు
మా అమ్మాయిని ప్రేమిస్తావా? అంటూ ఆగ్రహంతో రగిలిపోయిన అమ్మాయి తరఫు వారు.. అబ్బాయి ఇంటికి వెళ్లి..
మా అమ్మాయిని ప్రేమిస్తావా? అంటూ ఆగ్రహంతో రగిలిపోయిన అమ్మాయి తరఫు వారు.. అబ్బాయి ఇంటికి వెళ్లి.. పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టిన వైనం హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకొని సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మహానగర శివారులోని అల్వాల్ ప్రాంతానికి దగ్గరగా ఉండే మచ్చబొల్లారం డివిజన్ లోని గోపాల్ నగర్ కు చెందిన పాతికేళ్ల ప్రదీప్ తన తల్లిదండ్రులతో కలిసి గడిచిన 20 ఏళ్లుగా ఉంటున్నాడు.
గతంలో ప్రదీప్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె.. గతంలో ప్రదీప్ పని చేసిన బైక్ షోరూం యజమాని వివేకానంద అన్న కుమార్తె. బైక్ షోరూంలో పని చేసే సమయంలో ఆమెతో ప్రదీప్ కు పరిచయంకావటం.. అది కాస్తా ప్రేమగా మారింది. దీన్ని వివేకానంద సహించలేకపోయాడు. తన అన్న కుమార్తె జోలికి వెళ్లొద్దంటూ పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరిలో మార్పు లేదు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకున్న అతను.. తాజాగా షాకింగ్ ప్లాన్ చేశాడు.
మంగళవారం రాత్రి 9 గంటల వేళలో క్యాన్ లో పెట్రోల్ తీసుకొని ప్రదీప్ ఇంటికి వచ్చాడు. ఆ టైంలో ప్రదీప్ ఇంట్లో లేడు. అతడి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. తనతో తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ ను వారిద్దరిపై చల్లిన వివేకానంద.. నిప్పు అంటించటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రదీప్ తండ్రి ప్రకాశ్ ఒంటి మీద మంటలు అంటుకున్నాయి. ప్రదీప్ తల్లి హేమలతకు మాత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మంటలు తీవ్రం కావటంతో ప్రకాశ్ బయటకు పరుగుల తీశాడు. దీంతో.. ఇంటి బయట ఆడుకుంటున్న ఒక నాలుగేళ్ల చిన్నారి కూడా మంటలు అంటుకున్నాయి. ఆమెకు గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు కలుగుజేసుకొని మంటల్ని ఆపి ప్రకాశ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. 50 శాతం శరీరం కాలిపోవటంతో ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి. వివేకానంద కోసం వెతుకుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.