334 అణుబాంబులతో సమానం మయన్మార్ భారీ భూకంపం

తీవ్రమైన ప్రాణనష్టం.. అపారమైన ఆస్తినష్టాన్ని కలిగించిన మయన్మార్ భూకంపానికి సంబంధించిన విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి.;

Update: 2025-03-31 06:11 GMT
334 అణుబాంబులతో సమానం మయన్మార్ భారీ భూకంపం

తీవ్రమైన ప్రాణనష్టం.. అపారమైన ఆస్తినష్టాన్ని కలిగించిన మయన్మార్ భూకంపానికి సంబంధించిన విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం చోటుచేసుకున్న భూకంపం.. తర్వాత చోటు చేసుకున్న ప్రకంపనలు అత్యంత తీవ్రతతో ఉన్నట్లుగా అమెరికాకు చెందిన జియాలజిస్టు జెస్ ఫీనిక్స్ చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రతను ఆయన ఒక కొత్త కోణంలో చెప్పుకొచ్చారు. 334 అణుబాంబులతో జరిగే విధ్వంసంతో సమానంగా పేర్కొన్నారు.

భూగర్భంలో భారత - యురేషియనన్ టెక్ట్రానిక్ ఫలకాలు ఢీ కొన్న కారణంగా ఈ భారీ భూకంపం చోటు చేసుకుందని చెబుతారు. రానున్న కొన్ని నెలల వరకు ఆఫ్టర్ షాక్స్ (భారీ భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనలు) ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం మయన్మార్ భూకంపంలో 2972 మంది మరణించినట్లుగా అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. క్షతగాత్రుల సంఖ్య 3122గా చెబుతున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అంతర్యుద్ధం కారణంగా ఆంక్షలు అమలవుతున్న కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. భవన శిథిలాలు తొలగించి.. ఒక్కో డెడ్ బాడీని తీసేందుకు రెండు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లుగా చెబుతున్నారు. భారీ భూకంపం కారణంగా.. భూకంప అనంతరం ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. శుక్రవారం చోటు చేసుకున్న తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7.7గా నమోదైంది. ఆ తర్వాత చోటు చేసుకున్న ప్రకంపనలు 3.3 నుంచి 4.7 మధ్య ఉన్నాయి. ఆదివారం మండలే నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. మరిన్ని భూకంపాలు వస్తాయన్న అంచనాలతో మయన్మార్ ప్రజలు రోడ్ల మీదనే ఉంటున్నారు.

భూకంపం తీవ్రతకు పర్వత ప్రాంతమైన సికాయ్ దారుణంగా దెబ్బతిన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. 80 శాతం పట్టణం పూర్తిగా ధ్వంసం కాగా.. మిగిలిన 20 శాతం పాక్షికంగా భూకంప ప్రభావిత ఇళ్లతో మిగిలినట్లుగా చెబుతున్నారు. భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మయన్మార్ లో కమ్యునికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది.ఈ నేపథ్యంలో స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు.

మరోవైపు థాయ్ లాండ్ లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిపై ఆశలు వదులుకుంటున్నారు. ఇప్పటివరకు బయటకు వెలికి తీసిన వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉన్నది లేదు. మరోవైపు ఈ శిధిలాల్ని తొలగించటానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News