ఏపీలో ఆ రెండు చోట్లా 'నోటా' సరికొత్త రికార్డ్!
ఈ విషయంలో ఏపీలో రెండు నియోజకవర్గాలూ రికార్డ్ సృష్టించాయి.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీలోనూ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు అంతకు మించి అన్నట్లుగా నడిచిన పరిస్థితి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో "నన్ ఆఫ్ ది ఎబౌవ్" (నోటా) సరికొత్త రికార్డులు సృష్టించడమే కాకుండా.. గెలుపోటములను గట్టిగా ప్రభావితం చేసింది. ఈ విషయంలో ఏపీలో రెండు నియోజకవర్గాలూ రికార్డ్ సృష్టించాయి.
అవును... ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజారిటీలు, అత్యల్ప మెజారిటీలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నోటా కూడా ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఎన్నికల్లో నోటాకు లక్షల్లో ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఇదే సమయంలో కొంతమంది అభ్యర్థుల జయాపజయాలను నోటాకొచ్చిన ఓట్లు తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలుస్తుంది.
ఉదాహరణకు కేరళలోని అత్తింగళ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదూర్ ప్రకాశ్, సీపీఎం అభ్యర్థి వి జాయ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అనూహ్యంగా ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయమో ఒడిశాలోని జయంపురంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది.
ఇందులో బాగంగా... యపౌరంలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ బెహరా.. బీజేడీ అభ్యర్థి శర్మిష్ఠ సేథీపై 1.587 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇక్కడ కూడా నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి. ఇలా పలు నియోజకవర్గాల్లో ఈసారి నోటా కీరోల్ పోషించిందనే చెప్పాలి. ఇక అత్యధికంగా, అత్యల్పంగా నోటాకు పోలైన స్థానాలు ఎక్కడ, ఎన్నేసి ఓట్లు అనేది ఇప్పుడు చూద్దాం...!
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నోటాకు రికార్డ్ స్థాయిలో 2,18,674 ఓట్లు పోలయ్యాయి. దీంతో నోటా విషయంలో ఈ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇదే క్రమంలో... నోటాకు 50,470 ఓట్లు రావడంతో ఏపీలోని అరకు లోక్ సభ స్థానం రెండో స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో... నోటాకు అత్యల్ప ఓట్లు నమోదైన నియోజకవర్గం కూడా ఏపీలో ఉంది. విశాఖ లోక్ సభ స్థానంలో అత్యల్పంగా 5,313 ఓట్లు నోటాకు పడ్డాయి.