హోం శాఖ కష్టాలు తీరాయ్.. ఏకంగా 8 వేల కోట్ల కేటాయింపు!
తాజాగా ప్రవేశ పెట్టిన కూటమి సర్కారు స్వల్ప కాలిక బడ్జెట్‌లో హోం శాఖకు 8495 కోట్ల రూపాలను కేటాయించింది.
ఏపీ హోం శాఖ కష్టాలు దాదాపు తీరాయనే చెప్పాలి. ఈ శాఖ పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా.. ఆర్థిక సమస్యలు వెంటాడేవి. ముఖ్యంగా పోలీసులకు జీతాలు, ఖర్చులు, సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటివి హోం శాఖను దాదాపు చేతులు కాళ్లు కట్టేసినట్టు అయింది. ఇలాంటి కీలక సమయంలో కూటమి సర్కారు హోం శాఖకు పెద్ద పీట వేస్తూ.. బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం గమనార్హం.
తాజాగా ప్రవేశ పెట్టిన కూటమి సర్కారు స్వల్ప కాలిక బడ్జెట్‌లో హోం శాఖకు 8495 కోట్ల రూపాలను కేటాయించింది. దీనిలో పోలీసులకు, ఇతర ఉద్యోగులకు, విపత్తుల నిర్వహణ శాఖకు బకాయి ఉన్న రూ.6 వేల కోట్లను విడుదల చేసేందుకు అవకాశం ఏర్పడింది. దీంతోపాటు .. 2 వేల కోట్లతో అధునాతన పరికరాలను కొనుగోలు చేసేందుకు, పోలీసు స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా మార్గం సుగమం అయింది. వైసీపీ హయాంలో కేవలం 800-1000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన విషయం తెలిసింది.
అది కూడా ఏడాది మొత్తానికి కావడం అప్పట్లో వైసీపీ సర్కారు తీరుపై హోం శాఖ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమైంది. ఫలితంగా పోలీసులకు ఇవ్వాల్సిన టీఏ, డీఏలను బకాయి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఇప్పుడు మేలిమి కేటాయింపుల ద్వారా.. పోలీసుల పనితీరును మెరుగు పరచడంతోపాటు.. వారికి కావాల్సిన సదుపాయాలను, బకాయిలను కూడా చెల్లించేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది.
ఇటీవల రెండు మూడు సందర్భాల్లో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతోపాటు.. అధునాత సామగ్రి కొనుగోలు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. అయితే.. సాధార ణంగా ఈ విషయాలను ప్రభుత్వాలు పక్కన పెడుతుంటాయి. కానీ, తాజా బడ్జెట్‌లో కూటమి సర్కారు హోం శాఖ డిమాండ్లకు పెద్దపీట వేయడం గమనార్హం. దీంతో వారికి గతంలో ఎన్నడూ లేని విధంగా 8 వేల పైచిలుకు కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు, పోలీసు వ్యవస్థకు సర్కారు పెద్ద పీట వేసిందనే చెప్పాలి.