బంగారానికి ఏమైంది? 10 గ్రాములు రూ.80 వేలకు దగ్గరగా?

ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న బంగారం ధరలు గడిచిన కొద్ది రోజల్లో అంతకంతకూ ఎక్కువ అయిపోతున్న వైనం తెలిసిందే.

Update: 2024-09-29 10:30 GMT

ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న బంగారం ధరలు గడిచిన కొద్ది రోజల్లో అంతకంతకూ ఎక్కువ అయిపోతున్న వైనం తెలిసిందే. బంగారం కొనాలనుకునే వారికి.. దాని ధర వింటేనే షాక్ తగిలే పరిస్థితి తాజాగా నెలకొంది. చూస్తుండగానే పది గ్రాముల బంగారం రూ.70వేల నుంచి రూ.80 వేల దగ్గరకు వచ్చేసిన ఈ ధరాఘాతం ఇప్పుడు షాకిచ్చేలా మారింది. సరిగ్గా ఏడాది క్రితం రూ.60వేలు ఉన్న పదిగ్రాముల బంగారం ఇప్పుడు రూ.78వేలను దాటేయటమే కాదు.. రూ.80వేలకు దగ్గరగా దూసుకెళ్లిపోవటం ఆసక్తికరంగా మారింది.

ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో దిగుమతి సుంకాన్ని తగ్గించటంతో కాస్త తగ్గిన బంగారం ధర.. అంతలోనే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లిపోయింది. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ భారీగా పెరిగేలా చేసింది. బంగారానికి స్థానిక డిమాండ్ ఎక్కువగా ఉండటం.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ధరను అంతకంతకూ పెంచేలా చేస్తున్నాయి.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర 29 శాతం మేర పెరగటం గమనార్హం. గడిచిన పద్నాలుగేళ్ల వ్యవధిలో ఒక ఏడాది వ్యవధిలో ఇంతలా పెరగటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్.. రానున్న మూడు నెలల్లో పెళ్లిళ్లు భారీగా జరగనున్న నేపథ్యంలో రేటు ఎంత ఉన్నా.. బంగారాన్ని కొనేందుకు వెనక్కి తగ్గట్లేదు. జులైలో బంగారంపై ఉన్న దిగుమతి సుంకం తగ్గించటంతో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరగటం విశేషం.

2023-24 మొత్తంలో భారతదేశం 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 850 టన్నుల వద్దకు చేరటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదొక్క అంశం చాలు.. భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం చైనా తర్వాత భారత్ ప్రపంచంలో రెండో అతి పెద్ద బంగారు దిగుమతిదారుగా అవతరిస్తోంది.

ఫెడ్ రేట్ల కోత ఇప్పుడే ప్రారంభమైందని.. రానున్న మూడు.. నాలుగు నెలల్లో మరో ముప్పావు శాతం తగ్గే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీని వల్ల బంగారం దూకుడు తగ్గే ఛాన్సు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం రేటు 2900 డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ ధర రూ.85వేల వరకు చేరే ఛాన్సుంది. ఈ లెక్కన తులం (అంటే 11.7 గ్రాముల) ధర లక్ష రూపాయిల వరకు టచ్ కావటం పెద్ద కష్టమైన విషయం కాదన్న మాట నిపుణుల నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News