అమరావతికి 'కేసుల' గ్రహణం.. ఈ విషయం తెలుసా?
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని ప్రస్తుత కూటమి సర్కారు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని ప్రస్తుత కూటమి సర్కారు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వచ్చీరావడంతోనే సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి.. ఏయే పనులు ఏ స్థితిలో నిలిచిపోయాయో.. వాటిని పునరుద్ధరించేందుకు ఎంత సొమ్ము అవసరం అవుతుందో కూడా లెక్కగట్టారు. గత జగన్ ప్రభుత్వంలో ధ్వంసమైన అమరావతిని పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అమరావతి బాధ్యతలను మంత్రి నారాయణకు కూడా అప్పగించారు.
ఇంత వరకు బాగానే ఉంది. రైతులు కూడా సహకరించేందుకు రెడీగానే ఉన్నారు. కానీ, సమస్య ఇప్పుడు మరో రూపంలో తెరమీదికి వచ్చింది. గత వారం రోజులుగా అమరావతిపై అధ్యయనం చేసిన ప్రభుత్వ యంత్రాంగాలు.. అమరావతికి ఎదురు కానున్న కేసుల చిక్కులను.. చంద్రబాబు ముందు పెట్టారు. రాజధానిపై నమోదైన కేసులు.. పెండింగుల వివరాలు.. ఏయే కోర్టుల్లో ఎన్నెన్నికేసులు ఉన్నాయని అనే సంపూర్ణ సమాచారాన్ని వారు బాబుకు వివరించారు. వీటిని పరిష్కరించుకుని ముందుకు సాగితే.. తప్ప అమరావతి నిర్మాణంలో అడుగులు పడే అవకాశం లేదని కూడా వారు వెల్లడించడం గమనార్హం.
ఇవీ.. కేసుల చిక్కులు..
+ సుప్రీం, హైకోర్టు సహా.. స్థానిక కోర్టుల్లో మొత్తం 100కుపైగా కేసులు ఉన్నాయి.
+ సుప్రీం కోర్టులో ఆరు కేసులు, హైకోర్టులో ఒకటి విచారణ దశలో ఉన్నాయి.
+ రైతులు వ్యక్తిగతంగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 100కుపైగా కేసులు దాఖలు చేశారు. వీటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంది. కానీ, దీనికి కూడా సమయం పడుతోంది. కొందరు రైతులు.. తమకు ఇవ్వాల్సిన సొమ్ము ఇస్తే తప్ప.. వెనక్కి తీసుకునేది లేదని చెబుతున్నారు.
+ మాస్టర్ ప్లానుకు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు కోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులేమీ ఉండవని చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాన్ని కూడా కోర్టుకు చెప్పి.. ఒప్పించి.. ముందుకు సాగాలి. అయితే.. ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఇక్కడ ఇళ్ల స్థలాలు పొందిన పేదలతో వైసీపీ తెరవెనుక ఉండి.. కోర్టుల్లో కేసులు వేయించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
+ఇక, మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టులో కేసు ఉంది. దీనిని వెనక్కి తీసుకున్నా.. వైసీపీ కౌంటర్ వేసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
+ భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు సమయానికి ఇవ్వలేదని మరో పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగులో ఉండడం గమనార్హం. వీటన్నింటినీ పరిష్కరించాల్సి ఉంది. దీనికే కొన్ని వేల కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.
+ ల్యాండ్ పూలింగ్ కు కొంత మంది రైతులు సహకరించలేదు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు వంటి ప్రాంతాల్లో 1,197 ఎకరాల భూ సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వైసిపి ప్రభుత్వం 2023లో వెనక్కు తీసుకుంది. ఇది మరింతగా బాబు సర్కారుకు చిక్కులు తెస్తోంది. సో మొత్తంగా ఇవన్నీ పరిష్కారం అయి.. అమరావతి పట్టాలెక్కేందుకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.