తెలంగాణను వణికించిన గాలి.. 13 మంది ప్రాణాలు పోయాయి

వీకెండ్ ఆదివారం వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న రాకాసి గాలితో పెద్ద ఎత్తున ప్రాణనష్టం.. ఆస్తినష్టం వాటిల్లింది.

Update: 2024-05-27 04:14 GMT

వీకెండ్ ఆదివారం వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న రాకాసి గాలితో పెద్ద ఎత్తున ప్రాణనష్టం.. ఆస్తినష్టం వాటిల్లింది. చూస్తుండగానే.. పదమూడు మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు రాకాసి గాలుల్ని తలపించిన పరిస్థితి. దీనికి తోడు జోరు వాన తోడు కావటంతో భారీ ఎత్తున చెట్లు.. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో.. గందరగోళ పరిస్థితి నెలకొంది. అసాధారణ గాలులతో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో ఏడుగురు ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే కావటం గమనార్హం.

ఓవైపు గాలులు.. మరోవైపు వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. ఈ విచిత్రమైన పరిస్థితితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మేడ్చల్.. మల్కాజిగిరి.. హైదరాబాద్.. నాగర్ కర్నూలు.. నిజామాబాద్.. ఆదిలాబాద్.. ఉమ్మడి నల్గొండ.. సిద్దిపేట.. వికారాబాద్ జిల్లాల్లో గాలివాన ప్రజల్ని నానా అవస్థలకు గురి చేసింది. కొన్ని కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది.

గాలుల కారణంగా మరణించిన పదమూడు మందిలో నాగర్ కర్నూలు జిల్లాలలోనే ఏడుగురు కావటం తెలిసిందే. జిల్లాలో ఒకే ఘటనలో ఐదుగురు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. తాడూరుకు చెందిన బెల్లె మల్లేష్ అనే రైతు గ్రామ శివారులోని తన పొలంలో రేకుల షెడ్డు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి దగ్గర్లోని ముష్టిపల్లికి చెందిన చెన్నమ్మ.. రాములు అనే కూలీలు పని చేస్తున్నారు.

ఒక్కసారిగా విరుచుకుపడిన గాలులు.. వర్షానికి అక్కడి షెడ్ కూలిపోయింది. దీంతో.. ముగ్గరు చనిపోయారు. ఇదిలా ఉంటే తండ్రిని చూసేందుకు మల్లేష్ కుమార్తె అనూష అక్కడకు రావటం.. ఆమె కూడా మృత్యువాత పడ్డారు. అక్కడే పని చేస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇదే జిల్లాలో మరో ఉదంతంలో డ్రైవర్ వేణుగోపాల్ ప్రాణాలు కోల్పోయారు. ఇతడి విషాద ఉదంతం గురించి వింటే షాక్ తినాల్సిందే.

ఎందుకంటే.. ఈదురు గాలుల వేళ.. రేకుల షెడ్ మీద పెట్టిన రాయి విసురుగా వచ్చి క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ కు తగలటంతో అతగాడు అక్కడికక్కడే మరణించారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. మోటారు సైకిల్ మీద వెళుతున్న వారిపై చెట్టు మాను విరిగిపడటంతో ఇద్దరు.. హైదరాబాద్ లోని హఫీజ్ పేటలో గోడ కూలిన ఘటనలో ఒకరు.. తీవ్రమైన గాలి కారణంగా బిల్డింగ్ మీద పెట్టిన రాయి ఎగిరి పడి టూవీలర్ మీద వెళుతున్న వ్యాపారి రషీద్ మీద పడటంతో అతగాడు మరణించాడు. సిద్దిపేట జిల్లాలోలోని ములుగు మండలంలో ఈదురుగాలుల కారణంగా కోళ్ల ఫారం గోడ కూలటంతో ఇద్దరు మరణించారు. ఇలా రాకాసి గాలులు పెద్ద ఎత్తున ప్రాణాలు తీసింది.

Tags:    

Similar News