చలాన్ల చెల్లింపులకు భారీ స్పందన.. వసూళ్లు ఎన్ని కోట్లో తెలుసా?
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు చేసేవారికి ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు చేసేవారికి ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు భారీగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంటుతో భారీ స్పందన నమోదువుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 76 లక్షలకు పైగా చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకోవడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి చలాన్ల చెల్లింపులపై భారీగా డిస్కౌంట్ ఇచ్చింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన లభిస్తోంది.
దీంతో వాహనదారులు పెండింగ్ చలాన్లను చెల్లించడానికి భారీగా ముందుకొచ్చారు. పోలీసుల రికార్డుల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు కట్టాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 76.79 లక్షల చలాన్లను చెల్లించారు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రూ. 66.77 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు.. చలాన్ల పెండింగ్ పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై వారికి›మరింత వెసులుబాటును ఇచ్చింది. జనవరి 10 వరకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు వీలు కల్పించింది.
డిసెంబర్ 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ అవకాశం మరో 5 రోజులు(10వ తేదీ వరకు) మాత్రమే ఉందని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు సైబర్ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్ లతో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేసే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040–27852721, 8712661690(వాట్సప్) నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.