జగన్...పవన్...ఇలాగే ఉండాలి !
ఏపీ రాజకీయాల్లో చాలా ఆశించినవి జరగడం లేదు. ఓట్లు వేసిన ప్రజలు ఒక్కటిగా ఉంటారు.;

ఏపీ రాజకీయాల్లో చాలా ఆశించినవి జరగడం లేదు. ఓట్లు వేసిన ప్రజలు ఒక్కటిగా ఉంటారు. కానీ రాజకీయ పార్టీల అధినేతలు మాత్రం భిన్నంగా ఉంటున్నారు. వారు ప్రత్యర్థులుగా ఉండడంలేదు, శతృవులుగా మారిపోతున్నారు. ఒక మంచి సందర్భంలో కలుసుకున్నది లేదు, ఒక అభినందనలు ఒకరికి ఒకరు చెప్పుకున్నది లేదు.
ఎంతసేపూ విమర్శలే. రాజకీయంగా ఒకరి పతనం మరొకరు కోరుకోవడం వరకూ కూడా మంచిది కాదు అంతకు మంచి వ్యక్తిగత వైరాన్ని పెంచుకుని అలాగే ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక చిన్న విషాదం. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కుకుని తీవ్ర గాయాల పాలు అయ్యారు. దాంతో పవన్ విషయంలో అందరూ కన్సర్న్ చూపించారు.
ఆయనకు అండగా ఉంటామని కూడా ప్రకటించారు. అందరి నుంచి పవన్ కి ఇలాంటి సందేశాలు వచ్చాయి. కానీ అందరూ ఆశ్చర్యంగా చూసింది మాత్రం వైసీపీ అధినేత జగన్ నుంచి ఈ సందేశం రావడం. నిజానికి జగన్ ఇలాంటి విషయాల్లో స్పందిస్తారు. స్పందించాలి కూడా.
ఆయన పవన్ ని ధైర్యం ఇస్తూ అండగా ఉంటామని చేసిన ప్రకటన మాత్రం అందరికీ ఆకర్షించింది. పవన్ సైతం తనకు ఈ కష్టకాలంలో ధైర్యం చెప్పి తోడుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెబుతూ జగన్ పేరుని కూడా చెప్పారు.
పుట్టిన రోజులు పండుగలు వివిధ ఆనంద సందర్భాలలో ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకున్నా లేకపోయినా ఫర్వాలేదు. కానీ ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు నేనున్నాను అని మంచి మాట చెబితేనే అది బాగా వెళ్తుంది. జగన్ చేసినది అదే. పవన్ కూడా దానికి సరైన స్పందన తెలిపారు.
నిజానికి ఏపీ ప్రజలు కోరుకుంటున్నది ఇదే. రాజకీయ నాయకులు కష్టాలలో సుఖాలలో కూడా తాము అంతా ఒక్కటి అని చాటి చెప్పాలని. రాజకీయం అన్నది సేవ అయితే ఆ సేవ కోసం పోటీ పడాలి, ప్రజల మెప్పు పొందాలి. అంతే తప్ప ఒకరిని ఒకరు వర్గ శతృవులుగా చూసుకోవడం అన్నది మంచి విధానం కానే కాదు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అలిపిరి వద్ద మావోయిస్టులు పెట్టిన బాంబు దాడిలో ఆయన తీవ్ర గాయాల పాలు అయితే నాటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ పరుగున తిరుపతికి వచ్చి బాబుని పరామర్శించారు. రాజకీయాలు ఎలా ఉన్నా వ్యక్తిగత బంధాలు గట్టిగా ఉండాలని నాటి నాయకులు కోరుకున్నారు.
ఏపీ రాజకీయాల్లో కూడా ఆ మార్పు రావాల్సి ఉంది. నిజానికి చంద్రబాబు పుట్టిన రోజుకు జగన్ గ్రీట్ చేస్తారు. జగన్ బర్త్ డేకి బాబు గ్రీట్ చేస్తారు. అలా మిగిలిన వారు కూడా గ్రీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నది జనం కోరిక. పవన్ విషయానికి వస్తే ఆయన అందరివాడు గా ఉన్నారు. ఆయనకు ఇబ్బంది వచ్చింది. అంతా నిలబడ్డారు. ఆయన చిన్న కుమారుడు క్షేమంగా ఉండాలని ఆయురారోగ్యాలతో కళకళలాడాలని అంతా కోరుకుంటున్నారు.