యూఎస్ లో హెలెన్ విధ్వంసం... 32 లక్షల మందిపై ప్రభావం!

గంటకు 225 కిలో మీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షంతో హెలీన్ హరికేన్ యునైటెడ్ స్టేట్స్ ని వణికించేసింది.

Update: 2024-09-29 03:37 GMT

గంటకు 225 కిలో మీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షంతో హెలీన్ హరికేన్ యునైటెడ్ స్టేట్స్ ని వణికించేసింది. యూఎస్ ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానులలో ఒకటిగా నిలిచింది. ఇది ఫ్లోరిడాను తాకిన అత్యంత బలమైన తుఫానుగా చెబుతుండగా.. అనంతరం జార్జియా, కరోలినాస్ లపైనా పెను ప్రభావం చూపించింది.

అవును... హెరికేన్ హెలెన్ అమెరికాలో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ పెను తుపాను ధాటికి విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో సుమారు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. అనేక మందికి వరద ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఇప్పటివరకూ సుమారు 52 మంది మృతిచెందినట్లు చెప్పారు.

వీరిలో నార్త్ కరోలినాలో కనీసం 10 మంది మృతిచెందారని గవర్నర్ రాయ్ కూపర్ కార్యాలయం వెల్లడించింది. ఇదే క్రమంలో.. సౌత్ కరోలినాలో కనీసం 19 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అదేవిధంగా... జార్జియాలో కనీసం 17 మంది మరణించినట్లు గవర్నర్ బ్రియాన్ కెంప్ ప్రతినిధి వెళ్లడించారు.

ఫ్లోరియాడలో మృతుల సంఖ్య 11కి చేరిందని చెప్పగా.. వర్జీనియాలోని క్రెయింగ్ కౌంటీలో తుఫాను కారణంగా ఒకరు మరణించారని గవర్నర్ గ్లెన్ యంగ్ కిన్ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు ఈ తుఫాను కారణంగా సంభవించిన నష్టం బిలియన్ డాలర్కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ హెలెన్ తీవ్ర ప్రభావం చూపించింది. ఈ ప్రాంతాల్లో హరికేన్ ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోపక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దేశాధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

Tags:    

Similar News