రోడ్డుపై భార్య రీల్స్... భర్తకు ఊహించని షాకిచ్చిన డిపార్ట్ మెంట్!
ఈ సమయంలో తాజాగా ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప మామూలుగా ముంచలేదు!;

ఇటీవల కాలంలో ప్రదేశంతో సంబంధం లేకుండా.. దానివల్ల ఇతరులకు ఎంత ఇబ్బంది అనేది ఆలోచించకుండా రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నవారి సంఖ్యకు ఏమాత్రం కొదవ లేదనే సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని అసభ్యకరంగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. మరికొన్ని పబ్లిక్ లైఫ్ ని డిస్ట్రబ్ చేసేలా ఉంటాయి.
ఈ క్రమంలో.. ఇటీవల మెట్రో ట్రైన్స్ లోనూ, రోడ్డుపై బైక్స్ పైనా జనాలను ఇబ్బంది పెట్టేలా, రోడ్డుపై వెళ్లేవారిని భయబ్రాంతులకు గురిచేసేలా రీల్స్ చేస్తున్న వారి వ్యవహారాలు తెరపైకి రావడం, ఫోలీసులు చర్యలు తీసుకోవడం తెలిసిందే! ఈ సమయంలో తాజాగా ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప మామూలుగా ముంచలేదు!
అవును... నడి రోడ్డుపై ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద ఓ భార్య అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈ సమయంలో తాజా ఇంటర్నెట్ సంచలనం హర్యాన్వీ సాంగ్ కు నడి రోడ్డుపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన రీల్స్ ని ఆమె భర్త ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే.. ఈ విషయం డిపార్ట్ మెంట్ వరకూ చేరి, మొదటికే మోసం వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... మార్చి 20 సాయంత్రం 4:30 సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానకంగా ఉండే దేవాలయానికి వెళ్లింది! ఈ క్రమంలో దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్ 20 గురుద్వారా చౌక్ సిగ్నల్ లో తన వదిన పూజకు ఫోన్ ఇచ్చి, షూట్ చేయమని చెప్పి హర్యాన్వీ ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది.
అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేశాయి. దీంతో దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో ఏఎసై బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు.
ఈ సమయంలో.. సీసీటీవీ ఫుటేజ్ లో ట్రాఫిక్ కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతి, వీడియో తీసిన ఆమె వదిన పూజపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. అయితే.. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. సెక్టార్ 19 పోలీస్ స్టేషన్ లో సీనియర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును సస్పెండ్ చేశారు.
భార్య డ్యాన్స్ చేసిన వీడియోను అజయ్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడమే అతడు చేసిన నేరంగా చెబుతున్నారు! ఈ సమయంలో.. జ్యోతి, పూజలు కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరోపక్క తన ఉద్యోగం తనకు తిరిగి ఇప్పించాలని అజయ్.. పై అధికారులను వేడుకుంటున్నట్లు చెబుతున్నారు.