కిడ్నీ రాకెట్ నిందితుడు విదేశాలకు జంప్?
సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాననిందితుడు విదేశాలకు పారిపోయాడా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాననిందితుడు విదేశాలకు పారిపోయాడా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పవన్ అలియాస్ లియోన్ ఉరఫ్ కిషోర్.. విదేశాలకు వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మూడు వారాలుగా అతడి ఆచూకీ లభించకపోవటంతో అతను విదేశాలకు పరారై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ పోలీసులు తాజాగా లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా పేదలకు డబ్బులు ఆశ చూపించి.. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించటంలో పవన్ కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. పేదల్ని కిడ్నీ ఇచ్చేలా ఒప్పించటం.. కిడ్నీ అవసరమైన వారిని గుర్తించటం.. ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించటం.. సరూర్ నగర్ లోని అలకానంద ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించటం లాంటి అన్ని అంశాలకు ఇతడే కీలకసూత్రధారిగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి మధ్యవర్తిగా వ్యవహరించిన విశాఖకు చెందిన లక్ష్మణ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇతడే హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అవినాశ్ ను సంప్రదించి.. కిడ్నీ ఆపరేషన్లు చేసేలా ఒప్పించాడు. అనంతరం 2023 ఏప్రిల్ ుంచి 2024 జూన్ వరకు సైదాబాద్ లోని జనని ఆసుపత్రిలో నలభై వరకు ఆపరేషన్లు నిర్వహించారు.
ఇదే సమయంలో డాక్టర్ అవినాశ్ కు పవన్ పరిచయమయ్యాడు. జనని ఆసుపత్రిని మూసేసిన తర్వాత అలకనంద ఆసుపత్రి ఎండీ సుమంత్ ను ఆపరేషన్లు చేసేలా డీల్ కుదిర్చాడు. ఇక్కడే ఇరవైకు పైగా ఆపరేషన్లు.. అరుణ ఆసుపత్రిలో నాలుగు.. మరో ఆసుపత్రిలో పదికి పైగా ఆపరేషన్లు చేయటం ద్వారా ఒక్క హైదరాబాద్ సిటీలోనే తొంభై వరకు ఆపరేషన్లు చేయించినట్లుగా గుర్తించారు. మొత్తంగా కిడ్నీరాకెట్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విదేశాలకు పారిపోయినట్లుగా భావిస్తున్న పవన్ (లియోన్) ఆచూకీ లభిస్తే ఈ కేసులో పెద్ద బ్రేక్ త్రూ అయినట్లు అవుతుందని చెబుతున్నారు.