'ఎమ్మెల్సీ' ఎన్నికపై కమల నాథుల నయా ప్లాన్!
దీనిని బట్టి చూస్తే.. బీజేపీకి ఉన్న సంఖ్యాబలం అంటే.. కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు.. వంటివారి సంఖ్య కేవలం 25కే పరిమితమైంది.;

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే.. దీనికి సంబం ధించిన నామినేషన్ పర్వం పూర్తయింది. మొత్తంగా నలుగురు సభ్యులు మాత్రమే పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు బీజేపీ, మరొకరు ఎంఐఎం అభ్యర్థి కాగా.. మరో ఇద్దరు ఇండిపెండెంటుగా బరిలో నిలిచారు. అయితే.. బీజేపీ ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది గత నెలలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమల నాథులు ఆశించిన విధంగా విజయం దక్కించుకున్నారు. అదే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందన్న అంచనాలు వేసుకున్నారు.
అయితే.. వాస్తవానికిఏ ఎన్నికల్లో విజయం అయినా.. సంఖ్యా బలం ఉండాలి. పైగా.. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి.. కార్పొరేషన్ పరిధిలో ఉన్న సంఖ్యా బలం కీలకం. దీనిని బట్టి చూస్తే.. బీజేపీకి ఉన్న సంఖ్యాబలం అంటే.. కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు.. వంటివారి సంఖ్య కేవలం 25కే పరిమితమైంది. వాస్తవంగా 112 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ వంటివారిని పోగేసుకుంటే.. ఇది 125-130 వరకు ఉంటుంది. ఇంత భారీ సంఖ్యా బలంలో సగానికిపైగా ఓట్లు పడితేనే ఎవరైనా విజయం దక్కించుకుంటారు.
కానీ, ఈ పరంగా చూసుకుంటే.. బీజేపీకి ఉన్నది 25 మంది మాత్రమే. 2020లో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి 44 సీట్లు దక్కించుకున్నా.. తర్వాత.. జంపింగులతో ఈ సంఖ్య తగ్గిపోయింది. మరి ఇంత తక్కువ సంఖ్యా బలం పెట్టుకుని కూడా బీజేపీ ఎందుకు ఇంత గట్టిగా పోరాడుతోంది.? అన్నది ప్రశ్న. మరోవైపు.. తమకు ఒంటరిగానే 44 మంది కార్పొరేటర్లు ఉండడంతో పాటు.. తమను బలపరిచే బీఆర్ ఎస్‌కు కూడా.. దాదాపు 35-40 మంది(చాలా మంది జంప్ అయ్యారు) ఉన్నారు. వీరు ఐక్యం గా ఓటేస్తే.. ఎంఐఎం నిలబెట్టిన అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అవుతుంది. మరి ఇంత తెలిసినా బీజేపీ తన ప్రయత్నాలు మానుకోలేదు.
దీనికి ప్రధానంగామూడు కారణాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
1) మజ్లిస్‌ను వ్యతిరేకించే కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోవడం.
2) హిందూ అనుకూల అజెండా తమదేనని చాటుకునే ప్రయత్నం చేయడం.
3) రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తమదేనని నిరూపించడం.
ఈ మూడు కారణాలతోనే సంఖ్యా బలం లేకున్నా పోటీకి కమల నాథులు రెడీ అయ్యారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఏమో.. కార్పొరేటర్లు కలిసి వచ్చి.. తమ అభ్యర్థి గెలిచినా గెలవొచ్చని కమల నాథులు లెక్కలు వేసుకుంటున్నారు. అలా జరగని పక్షంలో తమ అభ్యర్థికి వచ్చే మెజారిటీని చూపించి.. తమ సత్తా పెరుగుతోందన్న విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. ఏదేమైనా బీజేపీ వేడి.. ఉత్సాహం తగ్గకుండా చూసేందుకు ఇదొక ప్రయోగమని.. కమల నాథులు చెబుతుండడం గమనార్హం.