అభ్యంతరకర పొస్టుల్లో హైదరాబాద్ టాప్... "స్మాష్" గురించి తెలుసా?

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-23 00:30 GMT

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఏపీ సర్కార్ ఈ వ్యవహారంపై స్ట్రాంగ్ యాక్షన్ కి దిగుతుండగా.. ఈ విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న హైదరాబాద్ లోనూ పోలీసులు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో "స్మాష్" ను తెరపైకి తెచ్చారు.

అవును... సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, విభేదాలు సృష్టిస్తున్న ఘటనలు హైదరాబాద్ లోనే ఎక్కువగా నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సీ.ఆర్.బీ.) - 2022 వెల్లడించింది. దేశంలోని 19 మెట్రో నగరల్లో హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచిందని తెలిపింది. 2022లో 94 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 20 నమోదైనట్లు చెబుతున్నారు.

ఇలా సిటీలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడాలు.. వాటిలో కొన్ని వర్గాల మధ్య వివాదాలకు దారి తీస్తుండటంతో హైదరాబాద్ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా స్మాష్ (సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్) విభాగాన్ని ఏర్పాటు చేశారు.

కాగా.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలు, విధ్వేషపూర్తి కామెంట్లు చేస్తున్నవారిపై పోలీసులు ఇప్పటికే కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. శాంతి భద్రతలతో పాటు.. సాధారణ ప్రజాజీవనంపైనా సోషల్ మీడియా పోస్టులు పెను ప్రభావం చూపిస్తోన్న నేపథ్యంలో ఈ సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో... కేవలం ఫిర్యాదులపైనే కాకుండా "సైబర్ ప్యాట్రోలింగ్" ద్వారా సోషల్ మీడియాలోని పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పోలీసులకు చిక్కినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, చిరు వ్యాపారులు, సాధారణ ఉద్యోగులు ఉంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News