హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త డీల్.. స్టేషన్ నుంచి మాల్ కు స్కైవాక్
కుకట్ పల్లిలో నిర్మిస్తున్న అతి పెద్ద ప్రైవేటు మాల్ కు.. బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వెళ్లేలా స్కైవాక్ ను రూపొందిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రోను మరింత ఆకర్షణీయంగా మార్చటం.. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం.. ఎప్పటికప్పుడు తమను తాము మార్చుకోవటానికి వీలుగా చేస్తున్న ఏర్పాట్లు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే నిర్వహణ నష్టాలతో భారీగా ఇబ్బంది పడుతున్న ఎల్ అండ్ టీ సంస్థ.. ఇప్పుడు కొత్త ఆవిష్కరణలకు తెర తీయటం ద్వారా ఇతర విధానాల్లో ఆదాయాలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక ప్రైవేట్ మాల్ కు స్కైవాక్ నిర్మించటం ద్వారా కొత్త డీల్ కు తెర తీసింది.
ఇప్పటివరకు మెట్రో స్టేషన్లతో ఎల్ అండ్ టీ మాల్స్ కు స్కైవాక్ ఏర్పాటు చేయటం ద్వారా.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా మాల్ లోకి వెళ్లే వీలుంది. హైటెక్ సిటీ.. పంజాగుట్ట స్టేషన్లలో ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా మాత్రం మెట్రో స్టేషన్ల నుంచి ప్రైవేటు మాల్ లోకి వెళ్లేలా రూపొందించిన కొత్త విధానంతో ఎల్ అండ్ టీకి ఆదాయం పెరగటంతో పాటు.. సరికొత్త బిజినెస్ డీల్ కు తెర తీసినట్లుగా చెప్పాలి.
కుకట్ పల్లిలో నిర్మిస్తున్న అతి పెద్ద ప్రైవేటు మాల్ కు.. బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వెళ్లేలా స్కైవాక్ ను రూపొందిస్తున్నారు. దీనికి హైదరాబాద్ మెట్రో సంస్థ కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో.. బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా మాల్ లోకి ఎంటర్ కావటంతో పాటు.. షాపింగ్.. సినిమాలు చూసుకునే సౌకర్యం ఉంటుంది.
ఇదే మోడల్ ను మిగిలిన మెట్రో స్టేషన్లలో కూడా అమలు చేసే ఉద్దేశంలో ఎల్ అండ్ టీ ఉంది. ప్రైవేటు వర్గాలతోనే ఈ తరహా డీల్ చేసుకోనున్నట్లుగా మెట్రో వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదిలో కుకట్ పల్లిలోని మాల్ అందుబాటులోకి రానుంది. మాల్ మొదటి రోజు నుంచే మెట్రో స్టేషన్ నుంచి స్కైవాక్ ద్వారా వెళ్లే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చెబుతున్నారు.