హెచ్‌సీయూలో రగడ.. లాఠీచార్జి.. ఏం జరిగింది?
విద్యార్థులపై ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాక్షస ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధిచెబుతారని అన్నారు.;

తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర రగడ చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు ఆందోళన, నిరసనలు చేపట్టాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారంరేగంది. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని బీజేపీ కీలక నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. విద్యార్థులపై ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాక్షస ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధిచెబుతారని అన్నారు.
ఏంటి వివాదం..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూమి విషయం అటు వర్సిటీకి, ఇటు ప్రభుత్వానికి మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ భూమిని ప్రభుత్వ అధికారులు సోమవారం ఉదయం చదును చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు.. భూమిని ప్రభుత్వం ఆక్రమించి.. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. అయితే.. ఈవ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం సదరు భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ సరిహద్దును ఆనుకుని ఉన్న భూములు ప్రభుత్వానివేనని తెలిపారు. వీటిని బాగు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందుకే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు చదును చేసేందుకు ప్రయత్నించారని దీనిని తప్పుపట్టా ల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. మరోవైపు.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంటోంది. విద్యార్థి సంఘాలు.. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే.. ఆందోళన మరింత తీవ్ర తరం చేస్తామన్నారు.