కదులుతున్న బస్సు.. హోటల్ రూమ్‌.. హైదరాబాద్ లో రెచ్చిపోయిన కామాంధులు!

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు

Update: 2024-07-31 04:16 GMT

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళ ఒంటరిగా కనిపిస్తే కామాందుల కళ్లు ఆమెను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.. మాటు వేస్తున్నాయి.. దారుణంగా దాడి చేస్తున్నాయి! ఈ విషయంలో తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు అనే తేడాలు కామంధులకు ఉండటం లేదు! ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి.

అవును... ఊరికి క్షేమంగా తీసుకెళ్తాడనుకున్న ఓ బస్సు డ్రైవర్... స్నేహితులే కదా వారితో కుర్చుని ఓ పెగ్గు వేసినా సేఫ్ గా నివాసం వద్ద బైక్ పైనో, కారులోనో డ్రాప్ చేసేస్తారు అని నమ్మిన అమ్మాయిపై కన్నేసిన వారు... ఎవరైనా కానీ, స్థలం ఏదైనా కానీ.. మృగాడి చేతిల్లో మహిళలు బలవుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి!

కదులుతున్న బస్సులో అత్యాచారం!:

కదులుతున్న బస్సులో ఓ మహిళపై ఆ బస్సులోని డ్రైవరే అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సులో బయలుదేరింది ఓ మహిళ (26)! ఈ సమయంలో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి తనపై డ్రైవర్ అత్యాచారం చేశాడంటూ అర్ధరాత్రి ఒంటిగంటకు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది బాధితురాలు.

దీంతో... వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఆపారు. అప్పటికే నిందితుడు పరారీలో ఉన్నాడు! అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపిన పోలీసులు... ఈ ఘటనతో షాక్ కి గురైన బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

యువతిపై స్నేహితులు గ్యాంగ్ రేప్!:

ఇలా కదులుతున్న బస్సులో ఓ ఘోరం జరగ్గా... వనస్థలిపురంలోని ఓ హోటల్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం... హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన ఓ యువతి తన చిన్ననాటి స్నేహితుడు, ఓ కామన్ ఫ్రెండ్ తో కలిసి ఓంకార్ నగర్ లో ఉన్న ఓ రెస్టారెంట్ కి వెళ్లింది. అక్కడ ఇద్దరూ మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్ కి వెళ్లారు.

ఈ సమయంలో మత్తులో ఉన్న ఆ యువతిపై ఆమె స్నేహితుడితో పాటు మరొక యువకుడూ లైంగిక దాడి చేసి పరారయ్యారు! అయితే సృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఐడీ ప్రూఫ్ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న బాధిత యువతి తల్లితండ్రులు.. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో... బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి వైద్యపరీక్ష నిమిత్తం తరలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు!

Tags:    

Similar News