"ఎన్ - కన్వెషన్" అనుమతులపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు!

ఇక మాదాపూర్ లోని ఎన్-కన్వెషన్ కూల్చివేత ప్రక్రియ చేపట్టిన అనంతరం హైడ్రా అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-08-27 12:40 GMT

ప్రస్తుతం హైడ్రా వ్యవహారం కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన అక్రమనిర్మాణం కనిపిస్తే హైడ్రా విరుచుకుపడిపోవడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇక మాదాపూర్ లోని ఎన్-కన్వెషన్ కూల్చివేత ప్రక్రియ చేపట్టిన అనంతరం హైడ్రా అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

అవును... గత శనివారం హైదరాబాద్ లోని మాదాపూర్ వంటి ప్రైమ్ ఏరియాలో సినీనటుడు నాగార్జునకు సంబంధించిన "ఎన్ - కన్వెషన్" కూల్చివేత ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి ఇప్పటికీ ఈ విషయం సంచలనంగానే ఉన్న పరిస్థితి! తమ్మిడికుంట చెరువు ఎఫ్.టీ.ఎల్. జోన్ ను ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ హైడ్రా ఈ నిర్మాణాలను కూల్చివేసింది!

దీంతో... ఈ విషయంపై స్పందించిన నాగార్జున ఎన్-కన్వెషన్ కూల్చివేత చట్టవిరుద్ధమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇదే క్రమంలో ఎన్- కన్వెషన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో ఈ కూల్చివేతలు నిలివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వ్యులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన... ఎన్ కన్వెషన్ ను నిర్మించడానికి మొదట అనుమతి లేదని, ఈ నిర్మాణం మొత్తం తుమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్.టీ.ఎల్.) జోన్ లో ఉందని నొక్కి చెప్పారు! ఇదే సమయంలో... ఈ నిర్మాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు! ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... 2014లోనే ఎన్ కన్వెషన్ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీ.హెచ్.ఎం.సీ) నోటీసులు జారీ చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే... ఈ నోటీసులపై ఎన్ కన్వెషన్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని అన్నారు. ఈ సమయంలో... ఎన్ కన్వెషన్ యాజమాన్యం సమక్షంలో సర్వే చేయాలని కోర్టు ఆదేశించిందని అన్నారు.

ఈ ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వే అనంతరం తుమ్మిడికుంట చెరువు ఎఫ్.టీ.ఎల్. పరిధిలోనే నిర్మాణం జరిగినట్లు నిర్ధారిస్తూ రెండో నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. అయితే... బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బీఆరెస్స్) కింద ఎన్ కన్వెషన్ యజమానులు ఈ నిర్మాణాన్ని క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారని.. అయితే, గత పదేళ్లుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందడంలో విఫలమయ్యారని రంగనాథ్ స్పష్టం చేశారు!

Tags:    

Similar News