హైడ్రా కీలక నిర్ణయం.. ఆ ఇళ్ల యజమానులకు బిగ్ రిలీఫ్

రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయం.. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి.

Update: 2024-09-08 11:10 GMT

హైదరాబాద్‌, ఔటర్ పరిధి వరకు నాలాలు, చెరువులు, కుంటలు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ రోజు కూడా పలు అపార్ట్‌మెంట్లు, విల్లాలను కూల్చివేస్తోంది. ఈ తరుణంలో హైడ్రా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదివారం మల్లంపేట్‌లోని విల్లాలు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయం.. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి.

అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో నివాసం ఉంటే వాటిని కూల్చివేయబోమని స్పష్టం చేశారు. నిర్మాణ దశలోనే ఉన్న వాటిని కూలుస్తామని చెప్పారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయని వెల్లడించారు.

బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని.. వాటిని ఉపేక్షించేది లేదని రంగనాథ్ చెప్పారు. అలాగే.. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు కమర్షియల్‌గా వినియోగిస్తున్నారని.. గతంలో కూడా వాటిని కూల్చివేశారని.. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే.. ఆ బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్‌రెడ్డిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

నివాసం ఉంటున్న ఏ ఇంటినీ కూల్చబోమని హామీ ఇచ్చారు. అలాగే.. ప్రజలకు కమిషనర్ కీలక సూచన చేశారు. బఫర్, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న ఇళ్లను, స్థలాలను కొనవద్దని కోరారు.

Tags:    

Similar News