హైడ్రా చూపు హైటెక్‌ సిటీ వైపు.. రేవంత్ సోదరుడికీ నోటీసులు!

అంతేగాక.. సీఎం రేవంత్ సోద‌రుడు ఉంటున్న ఇంటికీ నోటీసులు అంటించారు. చెరువులను ఎవరు ఆక్రమించినా.. ఏ పార్టీ వారైనా వదిలేది లేదని చెబుతున్న సీఎం రేవంత్ అందరూ సహకరించాలని కోరారు.

Update: 2024-08-29 06:10 GMT

హైదరాబాద్ లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల తర్వాత ప్రముఖమైనది దుర్గం చెరువు. హైటెక్‌ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్‌ గ్రామాల పరిధిలో ఉంటుందీ చెరువు. ఒకప్పటి శివారు.. హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత బాగా ఖరీదైన ప్రాంతంగా మారింది. అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు సహా అత్యంత విలాసవంతమైన భవనాలతో సైబరాబాద్ గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఇక్కడి దుర్గం చెరువు ఆక్రమణలపై హైడ్రా ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అధికారులు, ప్రముఖుల నివాసాలకు నోటీసులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక దుర్గం చెరువును ఆనుకుని ఉన్న ఖరీదైన భవనాలకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. 30 రోజుల్లో ఈ ఆక్రమణలను కూల్చేయాలని సూచించారు. అయితే, వారి స్పందనను బట్టి హైడ్రా నిర్ణయం తీసుకోనుంది.

దుర్గం చెరువు.. ఆక్రమణల పర్వం ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డు అని చెప్పగలిగే మాదాపూర్ లోని దుర్గం చెరువును ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఆక్రమణల తీరు ఎలా ఉందో తెలుస్తుంది. దీనిపైనే ప్రసిద్ధ తీగల వంతెన కూడా ఉంది. హైడ్రా తాజాగా దుర్గం చెరువులో నిర్మాణాలకు నోటీసులు పంపింది.

అయితే, ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు అందుకున్నవారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. హైటెక్‌ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్‌ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాస భవనాలు నిర్మించినవారు హడలెత్తుతున్నారు. ఈ చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇళ్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం గమనార్హం.

ఐఏఎస్ లనూ వదలకుండా హైడ్రా నోటీసులు జారీ చేసిన జాబితాలో పలువురు ఐఏఎస్‌ లు, ఐఆర్‌ఎస్‌ అధికారుల నివాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక.. సీఎం రేవంత్ సోద‌రుడు ఉంటున్న ఇంటికీ నోటీసులు అంటించారు. చెరువులను ఎవరు ఆక్రమించినా.. ఏ పార్టీ వారైనా వదిలేది లేదని చెబుతున్న సీఎం రేవంత్ అందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినదిగా ప్రచారంలో ఉన్న జొన్వాడ ఫాం హౌస్ లోనూ సాగునీటి అధికారులు కొలతలు తీశారు.

అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో..సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి మాదాపూర్‌ లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నారు. ఆయన ఇల్లు దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్‌) లో ఉన్నట్లు అధికారులు గుర్తించి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. అంతేకాదు.. దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకూ నోటీసులిచ్చారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News