హైడ్రా దూకుడు.. వైసీపీ నేతలకు ఝలక్

తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసానికి హైడ్రా ఝలక్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Update: 2024-09-08 08:08 GMT

అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యంగా.. చెరువులు, కుంటలను కాపాడడమే ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఇందుకోసం దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ కట్టడాలను.. బడా బాబులను సైతం ఎక్కడా వదిలిపెట్టడం లేదు. ఇందుకు సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేటమట్టం చేయడమే కాకుండా.. మరో నటుడు మురళీమోహన్‌కు నోటీసులు జారీ చేయడం ఉదాహరణకు చెప్పొచ్చు. అంతేకాదు.. భారీ విల్లాలను సైతం హైడ్రా కూల్చుతూ వస్తోంది.

ఆ పార్టీ.. ఈ పార్టీ.. మన పార్టీ అనే తేడా లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దాంతో సొంత పార్టీ కాంగ్రెస్ నేతలను సైతం హైడ్రా వదిలిపెట్టలేదు. అంతెందుకు సీఎం సొంత అన్న ఇంటికి కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో హైడ్రాపై ప్రజల్లోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

కట్ చేస్తే.. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసానికి హైడ్రా ఝలక్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలనూ తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

గత నాలుగైదు రోజులుగా సైలెంట్‌గా ఉన్న హైడ్రా ఒక్కసారిగా ఫీల్డ్‌లోకి దిగడంతో ఇప్పుడు అక్రమార్కుల్లో మరోసారి భయం కనిపిస్తోంది. మరోవైపు.. అక్రమాలకు పాల్పడిన పార్టీల నేతల్లోనూ ఆ భయం కనిపిస్తోంది. తాజాగా సినీనటుడు, వైసీపీ నేతను కూడా హైడ్రా వదిలిపెట్టకపోవడంతో.. తరువాత ఎవరికి నోటీసులు వస్తాయా..? ఎవరి కట్టడాలు నేలమట్టం అవుతాయా..? అని టెన్షన్‌తో ఉన్నారు.

Tags:    

Similar News