ఏపీలో లడ్డూ.. తెలంగాణలో హైడ్రా.. రచ్చరచ్చ
రెండు అంశాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.
రెండు అంశాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఐదేళ్ల తరువాత మరోసారి ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టారు. తెలంగాణలో దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరికీ వచ్చి రాగానే పెద్ద పెద్ద టాస్కులే ఎదురయ్యాయి. ఇటీవల రెండు రాష్ట్రాలనూ పెద్ద ఎత్తున పడిన వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. వాటి బారి నుంచి కాస్త కోలుకున్నాయో లేదో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం.. తెలంగాణలో హైడ్రా ఇష్యూ.. రచ్చ రేపాయి.
ఏపీలో గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం కొనసాగింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయనకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందులోనూ.. తిరుమల కూడా ఆ సమయంలో చర్చకు దారితీసింది. కొండ మీద అన్యమత ప్రచారం చేస్తున్నారని, టీటీడీ బోర్డులోనూ అన్యమతస్తులను నియమించారంటూ చాలా వరకూ విమర్శలు వచ్చాయి. అలాగే జగన్ హయాంలో కావాలనే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయనే అపవాదు కూడా ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోరకాల ఆరోపణలు చేసింది. తిరుమలపై జరుగుతున్న అన్యమత ప్రచారంపై గళమెత్తారు.
ఇదిలా ఉండగా.. ఐదేళ్ల తరువాత చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం రాజుకుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని పెద్ద ఎత్తున దుమారం రేపింది. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే లడ్డూ తయారీలో ఈ నెయ్యిని వినియోగించారని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే పలు శాంపిల్స్ టెస్టుల కోసం పంపించగా ప్రాథమికంగానూ నిర్ధారణ అయినట్లు చెప్తోంది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయంగా సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. తమ హయాంలో తీసుకున్న నెయ్యి కాదని వైసీపీ చెబుతుండగా.. దొంగ టెస్టులు, దొంగ ల్యాబ్ రిపోర్టులతో టీడీపీ నాటకాలాడుతోందని ఆరోపిస్తోంది. అవసరమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ చెప్పుకొచ్చారు. అటు ఈ వివాదాన్ని చంద్రబాబు చాలా వరకు సీరియస్ తీసుకున్నారు. తిరుమలను అపవిత్రం చేశారంటూ భగ్గుమన్నారు. ఎంతో దైవంగా కొలిచే తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారంటూ ఆరోపించారు. దోషులను వదిలబోమన్నారు. అందులోభాగంగా విచారణ నిమిత్తం సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి ఈ వివాదంపై సిట్ విచారణ కొనసాగుతోంది.
మరోవైపు.. ఈ వివాదం ఇరు పార్టీల మధ్య వివాదం రేపడమే కాకుండా.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, శ్రీవారి అభిమానులు కలత చెందారు. అలాగే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా వరకు నిరసనలు కొనసాగాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. ఇటు తెలంగాణలోనూ పలు చోట్ల శుద్ధి కార్యక్రమాలు సాగాయి. దేవుడా క్షమించు.. అంటూ పూజలు జరిగాయి. అయితే.. లడ్డూలో వాడిని నెయ్యి ఎవరి హయాంలో తీసుకొచ్చారు..? ఎవరు కొనుగోలు చేశారు..? ఎవరి వల్ల లడ్డూలో వాడాల్సి వచ్చింది...? అనేది పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఇక.. తెలంగాణకు వచ్చేసరికి ప్రస్తుతం హైడ్రా హవా నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ మహానగరం ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు వణికిపోతోంది. ఇందుకు కారణాలూ లేకపోలేదు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేసి అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఈ దుస్థితి నెలకొందనేది అందరికీ తెలిసిందే. అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలను ప్రోత్సహించిందని, దాంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నగర వరదల బారిన పడి ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణం ఈ కబ్జాలేనని పది నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి భావించారు. దాంతో ఈ అక్రమ కట్టడాలను ఉపేక్షించొద్దు అంటూ నిర్ణయించారు.
ఆ వెంటనే కేబినెట్‌లో చర్చించి హైడ్రా వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా.. అక్రమ కట్టడాలను నేలకూల్చడమే టార్గెట్‌తో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేసేందుకు ఏర్పాటైన హైడ్రాకు.. కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు. దాంతో ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు హైడ్రా రెండు నెలలుగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది. ముందుగా హైదరాబాద్ నగరం వరకే దాని పరిధిగా అనుకున్నప్పటికీ.. తరువాతి వచ్చిన డిమాండ్ లేదా చెరువుల కాపాడే నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా విస్తరించారు.
ఒక్కరితో మొదలైన హైడ్రాకు ఇప్పుడు పదుల సంఖ్యలో తోడయ్యారు. రెవెన్యూ, పోలీస్ తదితర డిపార్టుమెంట్ల నుంచి పదుల సంఖ్యలో సిబ్బందిని కేటాయించారు. అలాగే.. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా నియమింబోతున్నారు. దాంతో హైడ్రా మరింత స్ట్రాంగ్ అయింది. అలాగే.. ఇటీవల జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల నుంచి పలు అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ కేబినెట్‌లో నిర్ణయించారు. దాంతో హైడ్రాకే సర్వాధికారాలు కట్టబెట్టారు. దీంతో హైడ్రా మరింత దూకుడుగా సాగుతోంది.
ఇప్పటివరకూ హైడ్రా ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేశారు. అక్రమ కట్టడాలను కూల్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చుతూ ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేసింది. అందులో భాగంగా సినీనటుడు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్‌ను సైతం కూల్చి సంచలనం రేపింది. అంటే.. హైడ్రాకు పేద, పెద్ద అనే తేడా లేదని రుజువు చేసింది.
హైడ్రా విషయమై ఇప్పుడు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడం మంచిదే అయినప్పటికీ.. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీజేపీ, బీఆర్ఎస్ పక్షాలు వార్నింగ్ ఇస్తున్నాయి. మూసీ నదిని ప్రక్షాళన చేసే క్రమంలో దాని చుట్టుపక్కల ఉన్న కట్టడాలను నేలకూల్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు సిద్ధపడింది. దాంతో ఇప్పుడు బాధితుల నుంచి ఒక్కసారిగా నిరసనలు భగ్గుమంటున్నాయి. వారికి పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. బాధితులంతా కలిసి తెలంగాణ భవన్‌కు వెళ్లడంతో ఈ రచ్చ మరింత పీక్స్‌కు చేరింది. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటు బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై స్పందించారు. పేదల ఇళ్లను కూల్చడమే అభివృద్ధా అంటూ నిలదీశారు. అయితే.. మూసీ బాధితుల కోసం 15వేల డబుల్ బెడ్‌రూంలను రెడీ చేశామని, భూచట్టం ప్రకారం పరిహారం సైతం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొంత మంది బాధితులు మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో వారి నిరసనలతో హైడ్రా కూడా కాస్త వెనక్కి తగ్గింది. నిన్నటి నుంచి అక్కడ కూల్చివేతలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా వివాదం చర్చకు దారితీసింది. ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఈ రెండు అంశాలపైనే తిరుగుతున్నట్లు చెప్పొచ్చు.