పెద్ద ప్లానే ఇది... రేవంత్ హైడ్రా వ్యూహం ఇదే !!
ఈ ఏడాది జూన్ 27న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన హైడ్రా.. ఇప్పటికే 40 వేల ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించినట్టు పేర్కొంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దూకుడు ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. తన-మన అనే తేడా లేకుండా.. అక్రమ నిర్మా ణాలను కూల్చేస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై హైడ్రా.. డోజర్ ప్రయోగిస్తోంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా.. మరిన్ని ప్రశంసలే వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ జనాల నుంచి హైడ్రాకు మద్దతు పెరుగుతోంది.
ఈ ఏడాది జూన్ 27న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన హైడ్రా.. ఇప్పటికే 40 వేల ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించినట్టు పేర్కొంది. ఇది ఇంకా కొనసాగుతుందని కూడా తెలిపింది. అయితే.. అసలు ఈ రేంజ్‌లో రేవంత్ దూకుడు పెంచడానికి కారణం ఏంటి? హైడ్రా తీసుకురావడం.. దానిని అమలు చేయడం.. వెనక్కి తగ్గేదిలేదని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకే సాగుతామని చెప్పడం వెనుక కీలక కారణం ఏమైనా ఉందా? భగవద్గీతకు ముడిపెట్టి మాట్లాడిన తీరు వెనుక పక్కా రీజన్ ఉందా? అంటే.. ఉందనే అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఏడాది(2025) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) ఎన్నికలు జరగనున్నా యి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా గెలిపించుకునేందుకు రేవంత్‌రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారన్నది పరిశీలకులు చెబుతున్న మాట. జీహెచ్ ఎంసీ పరిధిలో క్లాస్ కంటే కూడా.. మధ్య తరగతి, మాస్ ఓటింగ్ ఎక్కువ. వీరిని తనవైపు తిప్పుకోగలిగితే.. జీహెచ్ ఎంసీలో పాగా వేయడం నల్లేరుపై నడకే అవుతుందన్నది రేవంత్‌రెడ్డి వ్యూహంగా ఉంది.
మరి మాస్ జనాలు ఆయనవైపు తిరగాలంటే.. రేవంత్‌కు జై కొట్టాలంటే.. ఏం చేయాలన్న ఆలోచన నుం చే హైడ్రా కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో ఓ అరగంట సేపు వర్షం కురిస్తే.. మునిగిపోతోంది.. మాస్ జనాలు ఎక్కువగా ఉండే.. ఖైరతాబాద్, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాలే. రోడ్లపై నీరు నిలిచిపోయి.. ట్రాఫిక్ ఆగిపోవడం.. వాహనాలు కొట్టుకుపోవడం కామన్‌గా మారింది. ఇళ్లలోకి నీరు కూడా చేరిపోయి.. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో చెరువులు ఆక్రమించడం వల్లే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయినా.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఉభయ కుశలోపరిగా.. మాస్ సమస్య పరిష్కారంతోపాటు.. రేవంత్ తప్ప ఎవరు చేయగలరు అనే మాట కూడా వినిపించడం ఖాయంగా మారింది. ఈ క్రమంలోనే రేవంత్ అటు జీహెచ్ ఎంసీలో పాగా వేసేందుకు కూడా ఇది తోడ్పడనుంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు పూర్తిగా మాస్ జనాల ఓటింగ్‌ను తనవైపు తిప్పుకొనే అవకాశం ఉంటుంది. ఇక, ప్రస్తుతం జీహెచ్ ఎంసీలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సహా కొందరు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో విజయం దక్కించుకునేందుకు హైడ్రా అనే పదునైన ఆయుధాన్ని బయటకు తీశారని అంటున్నారు పరిశీలకులు.