విరుచుకుపడుతున్న హైడ్రా... ముందు మఫ్టీలో వెళ్లి, తర్వాత దబిడి దిబిడే!

భారీ ఆక్రమణలపై శని, ఆదివారాల్లో విరుచుకుపడేలా ప్లాన్స్ చేసుకుంటున్నట్లున్నారు!

Update: 2024-08-25 08:23 GMT

ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు ఏర్పాటైన వ్యవస్థ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా).. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తుందని అంటున్నారు. కూల్చివేతల సమాచారాన్ని ఏమాత్రం బయటకు రానియ్యకుండా అనుకున్నపని అనుకున్నట్లు చక్కబెట్టేస్తున్నారు. భారీ ఆక్రమణలపై శని, ఆదివారాల్లో విరుచుకుపడేలా ప్లాన్స్ చేసుకుంటున్నట్లున్నారు!

అవును... ఔటర్ రింగ్ రోడ్ లోపలి భాగంలో ఉన్న మొత్తం ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ భూముల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికోసం బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించారు. దీనికి ఏవీ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించారు. ఈ క్రమంలో ఇప్పటికే రంగలోకి దిగిన ఈ హైడ్రా టీమ్... ఇప్పటివరకూ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిరంఆణాలను నేలమట్టం చేసింది.

ముందు మఫ్టీలో వెళ్తారు:!

అక్రమ నిర్మాణాలపై సమాచారం అందుకుని, అందుకున్న సమాచారం అధికారికంగా వాస్తవం అని ధృవీకరించుకున్న అనంతరం కూల్చివేతకు ఫిక్సైపోతుంది హైడ్రా. ఈ సమయంలో కమిషనర్ రంగనాథ్... కూల్చివేతలపై సమాచారం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ క్రమంలో ముందుగా సిబ్బంది మఫ్టీలో వెళ్లి నిర్మాణాలను పరిశీలించి వస్తారు.

అనంతరం కమిషనర్ రంగనాథ్ తో చర్చించి కార్యచరణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ముందురోజు రాత్రి యంత్రాలను సిద్ధం చేసుకుని.. సిబ్బందిని అలర్ట్ చేస్తారు. ఇక వేకువజామునే పోలీసు బందోబస్తు నడుమ, బుల్డోజర్లతో రంగంలోకి దిగుతారు. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడతారు. గంటల వ్యవధిలో పని పూర్తి చేసేస్తుంటారు.

ఎమ్మెల్యే అడ్డువస్తే...?:

హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత చింతల్ చెరువులో ఒక్క రోజులోనే 50 భవనాలను కూల్చేసిన పరిస్థితి! గండిపేట జలాశయం దగ్గర నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో 20 భవనాలను కూల్చేశారు. ఇక ప్రధానంగా కాటేదాన్ లో ఒక చెరువులోని ఆక్రమణలను కూల్చివేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అడ్డువస్తే... ఆయనను అరెస్ట్ చేసి మరీ పని పూర్తి చేశారు.

కూల్చివేతలకు సంబంధించిన సమాచారం లీకైతే సస్పెండ్ అనే హెచ్చరికలు రంగనాథ్.. తన సిబ్బందికి ఇవ్వడంతో ఎలాంటి ముందస్తు సమాచారం తెరపైకి రావడం లేదని అంటున్నారు.

హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్!:

హైడ్రాను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా హైడ్రా కింద 3వేల మంది సిబ్బందిని నియమించనున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఓ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల నేరుగా హైడ్రానే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వ్యులు వెలువడనున్నాయని సమాచారం.

మరిన్ని నగరాల్లో హైడ్రా తరహా...!

హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలు నిర్మించేవారికి సింహస్వప్నంగా మారిన హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరల్లోనూ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, గద్వాల్, కామారెడ్డి సహా పలు నగరాల్లోనూ, పట్టణాల్లోనూ దీనిని విస్తరించనున్నారని అంటున్నారు.

ఈ నగరాల్లో కూడా చెరువులు, ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్లు ఫిర్యాదులు అందాయని అంటున్నారు. ఇదే క్రమంలో బఫర్ జోన్లలోనూ అడ్డగోలు నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయని చెబుతున్నారు. దీంతో... ఆ నగరాలు, పట్టణాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని.. ఫలితంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను సంరక్షించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైడ్రాకు సమాచారం ఇవ్వండి!:

మీమీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణలకు గురైతే తమకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆక్రమణలకు పాల్పడితే ఎంత పెద్దవారైనా, ప్రముఖులైనా వదలబోమని, కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంతామని తెలిపారు. మీమీ ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై మీకు తెలిసిన సమాచారాన్ని హైడ్రాతో పంచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News