ఇండియా పేరును భారత్ గా మారిస్తే ఎన్ని రూ. వేల కోట్ల ఖర్చు అవుతుంది?

అనూహ్యమైన నిర్ణయాల్ని తీసుకోవటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుంటారు.

Update: 2023-09-08 04:16 GMT

అనూహ్యమైన నిర్ణయాల్ని తీసుకోవటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుంటారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి విన్నంతనే.. వావ్.. అన్నంత ఆశ్చర్యానికి గురి కాక మానదు. విసాదకరమైన అంశం ఏమంటే.. వావ్ అన్న జాతి జనులే.. ఆ తర్వాత కాలంలో వామ్మో అనుకోకుండా ఉండలేరు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విన్నంతనే దేశ ప్రజల్లో పలువురు.. అవినీతి మీద మోడీ మాస్టారు పూరించిన శంఖారావంగా భావించారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి అండగా నిలిచారు. అందుకోసం గంటల తరబడి బ్యాంకు ఏటీఎంల వద్ద నిలుచుకున్నారు. తమ వంతు కోసం నిరీక్షించారు. అదంతా దేశభక్తిని చాటటంలో భాగంగా భావించారు.

తీరా చూస్తే.. చివరకు అర్థమైందేమంటే.. పెద్ద నోట్ల రద్దు అన్నది పెద్ద ఫార్సు తప్పించి మరేమీ కాదని. ఎందుకంటే.. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదు. వేలాది కోట్ల రూపాయిల ఖర్చు మినహాయించి మరే చోటు చేసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మోడీ నోటి నుంచి ఏ నిర్ణయం వచ్చినా దాని కారణంగా భారీ బాదుడు జాతి జనుల మీద ఖాయంగా పడుతుందన్న విమర్శ ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

తాజాగా ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న నిర్ణయానికి మోడీ సర్కారు రావటం తెలిసిందే. భారత రాజ్యాంగంలో ఇండియాను.. భారత్ గా మార్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకుంటే.. పలు అంశాల్లో ఇండియా అన్న మాటే అధికారికంగా వాడుతున్నారు. విపక్ష కూటమి పేరు ఇండియా అన్న తర్వాత నుంచి మోడీ సర్కారు ‘భారత్’ జపాన్ని పఠిస్తోంది. ఈ కారణంగా దేశం మీదా.. దేశ ప్రజల మీదా పడే భారం భారీగా ఉంటుందన్నఅంవనాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ వర్సిటీల్లో ఇప్పటికే సర్క్యులేట్ అవుతున్న లెక్కల్ని చూస్తే.. భారత్ గా పేరును మార్చటం కారణంగా రూ.80వేల కోట్ల మేర ఖర్చు అవుతుందంటూ నోటికి వచ్చిన లెక్కల్ని చెప్పటం కనిపిస్తోంది. ఇలాంటివేళ..కాస్తోకూస్తో శాస్త్రీయంగా లెక్కలు కట్టిన ఒక వివరం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా.. దేశం పేరు మార్చటం ఖర్చుతోకూడున్న అంశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

సౌతాఫ్రికాకు చెందిన మేధో సంపత్తి న్యాయవాది.. బ్లాగర్ డారెన్ ఒలివర్ మోడల్ ఆసక్తికరంగా మారింది. ఇండియా పేరును భారత్ గా మారిస్తే దేశ ఖజానాపై రూ.14వేల కోట్లకు పైనే భారం పడుతుందని పేర్కొన్నారు. అదెలా అన్న విషయాన్ని ఆయన వివరిస్తున్నారు. 2018లో ఆఫ్రికాలోని స్వాజిలాండ్ దేశం తన పేరును ‘‘ఎస్వాతిని’’గా పేరు మార్చుకుంది. దీనికి అయ్యే ఖర్చు ఒలీవర్ లెక్క కట్టారు. దేశం పేరును మార్చటం పెద్ద పెద్ద సంస్థల రీ బ్రాండింగ్ ఎక్సర్ సైజ్ తో పోల్చటం గమనార్హం.

పేరు మార్చటం ఒక పెద్ద సంస్థ మొత్తం రెవెన్యూలో మార్కెటింగ్ ఖర్చులు ఆరు శాతంగా ఉంటాయని చెబుతూ.. రీ బ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్ నుంచి పది శాతం ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఆదాయం రూ.23.84 లక్షల కోట్లుగా లెక్కిస్తే.. ఒలివర్ మోడల్ లో ఆరు శాతం లెక్కలో రూ.14.30వేల కోట్లకు పైనే అవుతుంది. అదే..పది శాతాన్ని లెక్కిస్తే రూ.23.8 వేల కోట్లుగా చెప్పాల్సిందే. ఇదెంత భారీ ఖర్చు అంటే.. ప్రతి నెలా ఆహార భద్రత పథకం కోసం వినియోగిస్తున్న దాని కంటే ఎక్కువ ఖర్చుగా చెప్పాలి.

నిజానికి ఇండియా అంటేనే ఒక బ్రాండ్. ఇప్పుడు దాన్ని భారత్ గా మారిస్తే.. ఒక మంచి బ్రాండ్ ను కోల్పోయినట్లు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశం పేరును మార్చినప్పుడు కరెన్సీ నోట్ల మీద పేరు మొదలుకొని.. ఆధార్.. పాన్.. బ్యాంక్ .. వాహనాల నంబర్లు.. పాస్ పోర్టు మీద పేర్లు..ప్రభుత్వ సంస్థల పేర్లు ఇలా బోలెడంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా మోడీ మాష్టారు మనసుకు ఇండియా అన్న పేరు నచ్చకపోవటం అన్నది చూసినప్పుడు మాత్రం.. ఇంత ఖర్చు అవసరమా? అన్న భావన కలుగక మానదు.

Tags:    

Similar News