ఐఐటీ బాబా.. ఆయన జీవిత రహస్యం ఇదే..

హర్యానాకు చెందిన ఈ ఐఐటీ బాబా అసలు పేరు అభయ్ సింగ్. ఈయన ఐఐటీ బాంబేలో నాలుగేళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు.

Update: 2025-01-16 09:19 GMT

మహాకుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి తన్మయత్వం పొందుతున్నారు. కొందరు సాధువులు విచిత్ర వేషధారణ, ఆహార్యం, అలవాట్లతో భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వేలాది మంది సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిలో ఓ ఐఐటీ బాబా ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యాడు.

ఉత్తరప్రదేశ్‌లోన ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభం కాగా.. మొదటి రోజు నుంచే భక్తులు తరలివస్తున్నారు. భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా హాజరవుతున్నారు. విదేశాల నుంచి సైతం వచ్చి దర్శించుకుంటున్నారు. కేవలం మూడు రోజుల్లోనే 6 కోట్ల మంది భక్తులు వచ్చారు. అలాగే త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఇప్పుడు ఐఐటీ బాబాగా పేరుగాంచిన ఓ సన్యాసి వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది. ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐఐటీ బాంబేలోని ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన మసాని గోరాఖ్ అసలు బాబాగా ఎలా మారాడన్న అంశం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

హర్యానాకు చెందిన ఈ ఐఐటీ బాబా అసలు పేరు అభయ్ సింగ్. ఈయన ఐఐటీ బాంబేలో నాలుగేళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు, పోస్ట్ మాడర్నిజం, సోక్రటీస్, ప్లేటో గురించి చదివినట్లు అభయ్ సింగ్ మీడియాతో తెలిపారు. అనంతరం ఆర్ట్స్‌పై ఆసక్తితోనూ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేసినట్లు వెల్లడించారు. ఇక.. ఆధ్యాత్మిక జ్ఞానం సైతం పెంచుకోవాలనే ఉద్దేశంతో బాబాగా మారినట్లు తెలిపారు. శివునికి తన జీవితాన్ని అంకితం చేశారు.

ఐఐటీ స్టూడెంట్ బాబాగా మారిపోవడాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అలాగే.. తన జీవితానికి సంబంధించి అభయ్ సింగ్ ఇంకా చాలా విషయాలు పంచుకున్నారు. ముంబైలో ఐఐటీ చదివే సమయంలో ఏదో చేయాలనే తపన ఉన్నా తనకు అర్థం కాలేదని, అందుకే సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. సన్యాసిగా ఉండడమే తన జీవితంలో బెస్ట్ స్టేజ్ అంటూ చెప్పారు. ఐఐటీ బాబాకు ఫొటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టమని అంటున్నారు. ఆ ఇష్టంతోనూ కొన్ని రోజలు ఫొటోగ్రఫీ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఈ వృత్తిలో ఉంటే నిత్యం ప్రయాణాలు చేయొచ్చని అనుకున్నారు. సంపాదన, ఆనందం రెండూ ఉంటాయని భావించారు. కానీ.. ఇందులోనూ అనుకున్న స్థాయిలో మనశ్శాంతి లభించకపోవడంతో చివరకు బాబా అయినట్లు తెలిపారు.

Tags:    

Similar News