బాబు పవన్ రంగంలోకి దిగాల్సిందే !

కేంద్ర ప్రభుత్వం డీ లిమిటేషన్ కింద 2026 నాటికి దేశంలోని 543 లోక్ సభ స్థానాలను పునర్ విభజించబోతోంది.

Update: 2025-03-01 20:30 GMT

కేంద్ర ప్రభుత్వం డీ లిమిటేషన్ కింద 2026 నాటికి దేశంలోని 543 లోక్ సభ స్థానాలను పునర్ విభజించబోతోంది. దీని వల్ల లాభం ఎవరికి అంటే ఉత్తరాది రాష్ట్రాలకూ అలా బీజేపీకే అని అంటున్నారు. ఎందుకు ఈ విధంగా అన్నది చూస్తే కనుక డీలిమిటేషన్ ని జనాభా ప్రాతిపదికన చేస్తూండడమే దీనికి కారణం.

ఈ ప్రాతిపదికన ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో పెద్ద ఎత్తున లోక్ సభ సీట్లు పెరుగుతాయి. అవి అలా ఇలా కాదు, ఒకేసారి పదుల సంఖ్యలో పెరుగుతాయి. అదే దక్షిణాదికి వచ్చేసరికి రెండు మూడు తప్ప సీట్లు పెరిగేది లేదు. మరి ఇలాగైతే జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారత దేశం పాత్ర మరింత నామమాత్రం అవుతుందని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దేశంలో 1970 దశకం నాటికి జనాభా పెరుగుదల ఒక పెద్ద సామాజిక సమస్యగా ఉంది. దాంతో జనాభా నియంత్రణ అమలు చేయాలని దేశం కోరింది. దానికి దక్షిణాది రాష్ట్రాలు బాగా స్పందించి వీలైనంత వరకూ కట్టడి చేశాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు ఈ విషయంలో వెనకబడ్డాయి. దాని వల్ల ఆయా రాష్ట్రాలలో జనాభా ఇంతకు ఇంత పెరిగిపోయింది.

కానీ దక్షిణాదిన జనాభా గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే కనుక చాలా తక్కువగానే ఉంది. ఈ క్రమంలో డీ లిమిటేషన్ ని జనాభా ప్రాతిపదికన చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల దక్షిణాది రాష్ట్రాలు రగులుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఇది అన్యాయం అని అన్నారు. దీని మీద పోరాడుతామని చెప్పారు. మొత్తం సౌత్ ఇండియా ప్రాంతం అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

అదే సమయంలో తెలంగాణాలోని కాంగ్రెస్ కూడా అలాగే రియాక్ట్ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే డీ లిమిటేషన్ వల్ల దేశంలో ఎక్కడెక్కడ సీట్లు ఎంతెంత పెరుగుతాయన్నది ఒక్కసారి చూస్తే కనుక సౌత్ స్టేట్స్ కి మతి పోయేలా ఆ నంబర్ ఉందని అంటున్నారు. ఉత్తరాదిన యూపీ బీహార్ లలో పెద్ద ఎత్తున సీట్లు లోక్ సభకు పెరుగుతాయని అంటున్నారు.

యూపీలో ఇపుడు 89 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఈ రోజుకీ దేశంలో అతి పెద్ద ఎంపీలు ఉన్న స్టేట్ అది డీ లిమిటేషన్ తరువాత కూడా ఆ స్థానాన్ని యూపీ నిలబెట్టుకోవడమే కాదు మరింతగా సీట్లు పెంచుకుని దేశమంతా తన మీద ఆధారపడేలా చేసుకుంటుంది అని అంటున్నారు. యూపీలో ఏకంగా 120 దాకా ఎంపీ సీట్లు పెరుగుతాయని అంటున్నారు అంటే యాభై శాతం మేర పెరుగుదల అన్న మాట.

అదే విధంగా బీహార్ లో చూస్తే ప్రస్తుతం 40 లోక్ సభ సీట్లు ఉంటే అవి 70 దాకా పెరుగుతాయని అంటున్నారు. ఇది 60 శాతం మేర పెరుగుదల అన్న మాట. మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం 29 సీట్లు ఉంటే అవి 47కి పెరుగుతాయని అంటున్నారు. ఇవి కూడా యాభై శాతానికి కంటే ఎక్కువే అని అంటున్నారు.

మహారాష్ట్రలో 48 నుంచి 68కి సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. అంటే 50 శాతం కంటే ఎక్కువ ఇక్కడ కూడా పెరుగుతున్నట్లుగా లెక్క వేస్తున్నారు. రాజస్థాన్ లో 25 నుంచి 44 కి పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా అరవై అయిదు శాతం దాకా సీట్లు పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇక కర్ణాటకలో తీసుకుంటే 28 నుంచి 36కి మాత్రేమే ఈ పెరుగుదల ఉంటుంది. అంటీఅ కేవలం 20 శాతం మాత్రమ పెరుగుదల అన్న మాట. ఇక తమిళనాడులో 39 సీట్లు ఉంటే జస్ట్ రెండు మాత్రమే పెరిగి 41గా ఉంటాయన్న మాట. తెలంగాణాలో ఇపుడు 17 సీట్లు ఉంటే మూడు పెరిగి అవి 20కి వస్తాయని అంటున్నారు. ఏపీలో 25 ఉంటే అక్కడ కూడా 3 పెరిగి 28కి పెరుగుతాయని చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే కనుక దారుణంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన చేసే డీ లిమిటేషన్ తో నష్టపోతున్నాయని అంటున్నారు.

దీని మీద ఎన్డీయే కూటమి మిత్రులు అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇపుడు గట్టిగా నిలిచి ప్రశ్నించకపోతే మాత్రం మరో యాభై ఏళ్ళ పాటు ఈ రాష్ట్రాలలో సీట్లు మళ్ళీ పెరిగేది ఉండదు. అలా ఒక కీలకమైన తరం నష్టపోతుందని అంటున్నారు.

Tags:    

Similar News