ఇండీయా కూటమిలో నెర్రెలు కాదు.. బీటలే!
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు విచ్ఛిన్నం దిశగా అడుగులు కాదు.. పరుగులు పెడుతున్నాయి. తాజాగా మారిన జాతీయ రాజకీయాల ముఖ చిత్రం చూస్తే..ఈ పరిస్థితి స్పస్టంగా కనిపి స్తుంది.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు విచ్ఛిన్నం దిశగా అడుగులు కాదు.. పరుగులు పెడుతున్నాయి. తాజాగా మారిన జాతీయ రాజకీయాల ముఖ చిత్రం చూస్తే..ఈ పరిస్థితి స్పస్టంగా కనిపి స్తుంది. ప్రధానంగా కాంగ్రెస్‌పార్టీ యువ నాయకుడు, ఎంపీ రాహుల్ పెత్తనాన్ని ఎవరూ సమర్థించడం లేదు. నిజానికి ఆయన పైకి సౌమ్యంగా కనిపిస్తున్నా.. అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం.
మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్, జమ్ము కశ్మీర్‌లో పేలవమైన ప్రదర్శన చూపిన తర్వాత.. కూడా కాంగ్రెస్ చెప్పింది వినాలన్న రాహుల్ ఎత్తుగడలను కూటమి పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు తోసిపుచ్చుతున్నాయి. మీరు చెప్పద్దు.. వినండి! అంటూ.. బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ఆజ్యంపోస్తుండడంతో పాటు కూటమిలో వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇక, అయోధ్య రామలయాన్ని సమర్ధించడంద్వారా.. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తన దారిని చెప్పకనే చెప్పింది.
అంటే.. రేపో మాపో.. ఉద్ధవ్ కూడా.. బీజేపీ పంచన చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, మమతా బెనర్జీ.. తనే సొంతగా పోటీకి రెడీ అవుతున్నానని.. ఇండియా కూటమిని తనే నడిపిస్తానని చెబుతున్నారు. అంతేకాదు.. వేరే వారి సారథ్యం తనకు అవసరం లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు.అయితే.. నీకున్న సామర్థ్యం ఏంటి? అని కాంగ్రెస్ నుంచి ఆమెకు ప్రశ్నల పరంపర వస్తున్నా..ఆమె వాటిని ఖాతరు చేయడంలేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను ఆరు చోట్ల మమతా బెనర్జీ నిలబెట్టిన సభ్యులు విజయం దక్కించుకోవడం ఆమె రాజకీయ పరిణితికి చిహ్నంగా మారింది.
మరోవైపు.. యూపీలో వచ్చే ఏడాదిఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎస్పీ నేత అఖిలేష్ కూడా.. తన దారి తాను చూసుకుంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌తో ఉంటే.. ఉన్నది, ఉంచుకున్నదికూడా పోతుందని ముందే లెక్కలు వేసుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసేది లేదని తెగేసి చెప్పారు.
ఇప్పటికే సగానికి పైగా స్థానాల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించారు. నిజానికి ఇండియా కూటమిలో ఈ పార్టీలే కీలకంగా ఉన్నాయి. మరి ఈపార్టీలే సహకరించనప్పుడు.... ఇండియా కూటమి ఎక్కడిదన్నది.. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. కాబట్టి.. ఇండియా కూటమి విచ్చిన్నం దిశగా పరుగులు పెడుతోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.