ఈవీఎంలపై 'ఇండియా' పోరుబాట.. మరో జోడోయాత్రలా ఉద్యమం

ఇటీవలే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆ కూటమి ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Update: 2024-11-27 11:30 GMT

ఇటీవలే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆ కూటమి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ.. అనూహ్యంగా మహారాష్ట్రలో ఊహించని ఫలితాలు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. 288 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 235 సీట్లతో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతిపక్షంలోని అఘాడీ కూటమికి అతి కష్టమ్మీద 49 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇప్పుడు మహావికాస్ అఘాడీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగేందుకు సిద్ధమైంది. ఈ ఫలితాలు నమ్మశక్యంగా లేవని ఆరోపిస్తోంది.

ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అందువల్లే తాము ఓడిపోయామని, లేదంటే తప్పకుండా తమ కూటమి అధికారంలోకి వచ్చేదే అని అంటున్నారు. మహావికాస్ అఘాడీ కూటమిలో భాగమైన కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటమి చెందిన స్థానాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు.

ఇందుకు దేశ, రాష్ట్రస్థాయిలో లీగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాయి. అటు మహారాష్ట్ర ఎన్నికల ఫతిలాలపైనా కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు సిద్ధం అయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఎలా అయితే భారత్ జోడో యాత్ర జరిగిందో.. అదే తరహాలో దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు.. హర్యానా ఎన్నికల ఫలితాల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్ షేర్ లభించింది. దాంతో అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని నివేదికలు వెల్లడించారు. కానీ.. అక్కడ కాంగ్రెస్ బోల్తాపడింది. అక్కడ కూడా ఈవీఎం మిషిన్లను ముందుగానే హ్యాక్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్ని కూడా నిరాధార ఆరోపణలే అని కేంద్ర ఎన్నికల కమిషన్ కొట్టేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపి 86 స్థానాలలో పోటీ చేస్తే కేవలం పది సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. దాంతో ఈ ఫలితాల పట్ల శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థులను వీవీ ప్యాట్ స్లిప్స్ ధ్రువీకరణ చేయాలని సూచించారు. 101 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 16 సీట్లలోనే గెలుపొందింది. ఉద్ధవ్ శివసేన 95 సీట్లకు గాను 20 స్థానాల్లో గెలిచింది. ఈ క్రమంలో తమ పరాభావానికి ఈవీఎంలే కారణమని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందుకోసం కోర్టులో పోరాడేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, ఎస్ఎస్, యూబీటీ లీగల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కూటమి.. జార్ఖండ్‌లో విజయంపై మాత్రం ఎలాంటి సందేహాలు లేవని చెప్తుండడం గమనార్హం.

Tags:    

Similar News