భారత్ పై ద్వేషం - ఉగ్రవాదానికి ఊతం... నాడు తండ్రి - నేడు కొడుకు!
ఈ విషయంలో తండ్రీకొడుకులిద్దరు టాపర్సే అంటున్నారు పరిశీలకులు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కారణంగా భారత్ తో దౌత్య సంబంధాలు క్షీణించాయి. అయితే దీనికంతటికీ కారణం ట్రూడో వైఖరి.. ఆయన తండ్రి నుంచీ వారసత్వంగా వస్తోన్న ఉగ్రవాదులకు ఊతమిచ్చే ఆలోచనా విధానం.. భారత్ పై నింపుకున్న ద్వేషమే కారణం. ఈ విషయంలో తండ్రీకొడుకులిద్దరు టాపర్సే అంటున్నారు పరిశీలకులు.
అవును... చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారత్-కెనడా మద్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. దీనికి కారణం ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అనుసరిస్తున్న వైఖరే. అయితే కెనడా నుంచి భారత్ కు ఈ తరహా ఇబ్బందులు ఎదురవ్వడం ఇదే తొలిసారి కాదు! జస్టిన్ ట్రూడో తండ్రి పిరె ఇలియట్ ట్రూడో కూడా గతంలో ఇలానే వ్యవహరించారు.
1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో యునైటెడ్ కింగ్ డమ్ కు బయలుదేరింది కనిష్క అనే ఎయిరిండియా విమానం. ఆ విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబులతో గాల్లోనే పేల్చేశారు. దీనికి ప్రధాన సూత్రధారి కెనడాలో తలదాచుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది తల్వీందర్ సింగ్ పర్మార్ అని చెబుతారు!
అయితే.. అలాంటి ఉగ్రవాదికి ఆనాటి కెనడా ప్రధాని, ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి.. పిరె ట్రూడో వెనకేసుకొచ్చారు. అతడిని అప్పగించాలన్న నాటి భారత ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ ప్రమాదానికి ముందే భారత నిఘావర్గాలు కెనడా ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అయినా కెనడా ప్రభుత్వం వాటన్నింటినీ పెడచెవిన పెట్టింది.
ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదాన్ని విచారించిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా పోలీసులను, నిఘా విభాగాన్ని, అధికారులను తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ప్రమాదం గురించి కెనడా అధికారులకు ముందే తెలుసని ఆక్షేపించింది. ఈ సమయంలో... ఈ పేలుడుకు కారణమైన పర్మార్ సహా మరికొంతమందిని కెనడా ప్రభుత్వం ఆరెస్ట్ చేసింది.
అయితే... వీరందరిలో ఇందర్ జిత్ సింగ్ అనే ఒక్కరికి మాత్రమే 15 ఏళ్ల జైలు శిక్ష విధించి.. మిగిలిన అందరినీ నిర్దోషులుగా వదిలేసింది. దీనిపై నాటి భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
వాస్తవానికి స్వాతంత్ర్యానికి ముందు నుంచే పంజాబ్ నుంచి అనేక మంది సిక్కులు కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపాడిపోయారు. 1970ల్లో కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాలు సులభతరం కావటంతో భారత్ నుంచి ఆదేశానికి భారీగా వలసలు ఉండేవి. సరిగ్గా అదే సమయంలో పంజాబ్ లో ఖలిస్థాన్ వాదం పెరిగింది. ఇది భారత్ కు తలనొప్పిగా మారింది.
దీంతో... ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులంతా కెనడాను సురక్షిత స్థావరంగా ఎంచుకున్నారు. అలా వెళ్లినవారిలో పంజాబ్ లో ఇద్దరు పోలీసులను చంపి పారిపోయిన పర్మార్ ఒకడు! దీంతో.. పర్మార్ ను తమకు అప్పగించాలని 1982లో భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని.. ట్రూడో ప్రభుత్వం తిరస్కరించింది.
అయితే... నాడు అలా తప్పించుకున్నప్పటికీ పాకిస్థాన్ నుంచి భారత్ లోకి దొంగతనంగా అడుగుపెట్టిన పర్మార్ 1992లో పంజాబ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు.