ఉగ్రవాదులారా జాగ్రత్త!... భారత్ సంచలన నిర్ణయం!
సరిహద్దు వెంబడి కూర్చున్న ఉగ్రవాదులను, శత్రువులను ఎదుర్కోవడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరో పెద్ద అడుగు వేసింది.;

ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. ప్రధానంగా ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా భద్రతా పరంగానూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాలి! ఆ దేశ రక్షణ దళాల బలాలు గుర్తుకు వస్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాలని చెబుతారు! ఈ నేపథ్యంలో.. భారత్ కు ఉగ్రవాదుల ముప్పు ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని చెబుతుంటారు.
వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.. వారిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు.. వారికి ఎవరు ఆశ్రయం కల్పించి భారత్ వైపు ఉసిగొల్పుతున్నారు అనే విషయాలు దాదాపు బహిరంగ రహస్యాలనే చెప్పాలి. ఈ సమయంలో ఆ ఆలోచన చేసే దేశాలకు, ఉగ్రవాదులకు బిగ్ అలర్ట్ ఒకటి తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా.. భారత్ ఓ పెద్ద అడుగు వేసింది.
అవును... సరిహద్దు వెంబడి కూర్చున్న ఉగ్రవాదులను, శత్రువులను ఎదుర్కోవడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరో పెద్ద అడుగు వేసింది. ఇందులో భాగంగా... రూ.54,000 కోట్ల విలువైన సైనిక ఆధునీకరణ ప్రణాళికలను మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వీటిలో బ్రహ్మోస్ క్షిపణి నుంచి టార్పెడోల వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్, రష్యా సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది భారత అమ్ములపొదిలో ఆసక్తికర ఆయుధంగా మారిందని అంటున్నారు. ఈ క్షిపణి కోసం అదనంగా మరో రూ.20,000 కోట్లు కేటాయించడానికి డీఏసీ ఆమోదం తెలిపిందని తెలుస్తోంది.
ఫలితంగా ఇప్పుడున్న దీని పరిధి 290 కి.మీ నుంచి 450 కి.మీ పెంచారన్ని తెలుస్తోంది. ఇదే సమయంలో.. వైమానిక దళం కోసం ఆరు కొత్త ఏ.ఈ.డబ్ల్యూ&సీ మార్క్ 1ఏ విమానాల కొనుగోలుకు రక్షణ సముపార్జన మండలి ఆమోదం తెలిపిందని అంటున్నారు. దీన్ని నేత్ర విమానం అని కూడా అంటారు. వీటి సంఖ్య మరింత పెరగాలని అంటున్నారు!
అదేవిధంగా... స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వరుణాస్త్ర టార్పెడోలు, రష్యన్ షిటిల్ యాంటీ ఎయిర్ క్రాప్ట్ క్షిపణులు నావికాదళానికి ఆమోదం పొందాయి. ఈ క్షిపణులను నేవీ అప్ గ్రేడ్ చేసిన నాలుగు క్రీవాక్ ట్రిపుల్ ఐ తరగతి యుద్ధనౌకలలో మొహరించనున్నారని అంటున్నారు. వీటి మొత్తం ఖర్చు రూ.13,000 కోట్లని తెలుస్తోంది!
మరోపక్క భీష్మ యుద్ధ ట్యాంకుల విషయంలోనూ రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా... ఈ యుద్ధ ట్యాంకుల ఇంజిన్లను అప్ గ్రేడ్ చేయనుంది. ఈ క్రమంలో.. ఇప్పటి వరకూ ఈ ట్యాంకులకు ఉన్న 1000 హార్స్ పవర్ ఇంజిన్లను 1350 హార్స్ పవర్ ఇంజిన్ లతో అప్ గ్రేడ్ చేయనున్నారు!