వారానికి 4 రోజులే పని... భారత్ లో కొత్త లేబర్ కోడ్ ప్రణాళిక - మూడు దశలు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే బడ్జెట్ లో లేబర్ కోడ్ లను దశలవారిగా అమలుచేసే ప్రణాళికను ప్రకటించొచ్చని అంటున్నారు.
ఇటీవల కాలంలో వారానికి ఎన్ని పని గంటలు ఉండాలనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే.. కాదు 90 గంటలు చేయాలని మరొకరు అంటున్నారని చర్చ. ఈ సమయంలో... వారానికి నాలుగు రోజులే పని దినాలు కలిగి ఉన్న దేశాలపైనా చర్చ మొదలైంది.
ఈ సందర్భంగా బెల్జియం, ఐస్ లాండ్, లిథువేనియా, ఫ్రాన్స్ మొదలైన దేశాలలోని పనిగంటలపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లోనూ వారానికి 4 రోజులే పని వ్యవహరంపై చర్చ మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే బడ్జెట్ లో లేబర్ కోడ్ లను దశలవారిగా అమలుచేసే ప్రణాళికను ప్రకటించొచ్చని అంటున్నారు.
అవును.. రానున్న బడ్జెట్ లో మోడీ సర్కార్ కొత్త లేబర్ కోడ్ నిబంధనల అమలును ప్రకటించవచ్చని.. రాబోయే బడ్జెట్ లో లేబర్ కోడ్ లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ సందర్భంగా.. భారత్ లో కొత్త లేబర్ కోడ్ లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో... లేబర్ కోడ్ కొత్త విధానాలు ఒకేసారి అమలు చేయడం యాజమాన్యాలకు సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తు.. ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని అంటున్నారు. దీనివల్ల వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది.. కాకపోతే రోజువారీ పని గంటలు పెరుగుతాయి!
ఈ క్రమంలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు మొదటి దశలో ఈ కొత్త లేబర్ కోడ్ లను అనుసరించడం తప్పనిసరి అని అంటున్న వేళ.. 100 నుంచి 500 మంది ఉద్యోగులున్న మీడియం స్థాయి కంపెనీలు రెండో దశలో వీటిని అనుసరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అనంతరం.. 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలు ఈ కోడ్ లను అమలు చేయనున్నాయని అంటున్నారు. అయితే.. ఈ చిన్న సంస్థలు ఈ కొత్త లేబర్ కోడ్ లను అమలు చేయడానికి సుమారు రెండేళ్లు పడుతుందని అంటున్నారు. కాగా.. దేశంలో సుమారు 85 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్నవి చిన్న పరిశ్రమలనే సంగతి తెలిసిందే.
కొత్త లేబర్ కోడ్ ల ప్రకారం వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానంగా ఉండవచ్చని అంటున్నారు. అయితే... ఉద్యోగులకు పని - వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశ్యమని చెబుతున్నారు. అయితే.. రోజువారీ పనిగంటలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు.