భార్యబిడ్డలను రేప్ చేసినోళ్లతో బంగ్లా చెట్టాపట్టాల్

తన తండ్రితో పాటు కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన సమయంలో తన చెల్లెలు రెజీనాతో పాటు భారత్ లో ఆశ్రయం పొందారు.

Update: 2025-01-02 16:30 GMT

ఒకప్పుడు అవిభాజ్య భారత దేశంలో భాగమైన బంగ్లాదేశ్.. పాకిస్థాన్ ప్రాంతం కంటే చారిత్రకంగా, కల్చరల్ గా భారత్ తో ఎక్కువ సంబంధాలు కలిగినది. అంతేకాదు.. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారత్ పాత్ర మరువలేనిది. పాకిస్థాన్ చేతిలో అణచివేతకు గురవుతున్న బంగ్లాకు విముక్తి కల్పించింది భారత్. ఇక బంగ్లాదేశ్ జాతిపిత, అవామీ లీగ్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ భారత్ తో సత్సంబంధాలను నెరపేవారు. ఆయన కుమార్తె, గత ఏడాది ఆగస్టు వరకు బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా కూడా భారత్ పక్షపాతే. తన తండ్రితో పాటు కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన సమయంలో తన చెల్లెలు రెజీనాతో పాటు భారత్ లో ఆశ్రయం పొందారు.

భారత్ అనుకూలం.. వ్యతిరేకం

బంగ్లాదేశ్ లో రెండు పార్టీలు ప్రధానమైనవి. ఒకటి అవామీ లీగ్. రెండోది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ). ఈ రెండో పార్టీ అధినేత్రి ఖలీదా జియా. ఈమె భారత్ కు పచ్చి వ్యతిరేకి. ఇక హసీనా సర్కారు ఖలీదా జియాను వేర్వేరు కేసుల్లో జైల్లో పెట్టించింది. గత ఏడాది హసీనా సర్కారు పతనం తర్వాత అక్కడ పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. కాగా, హసీనా స్థానంలో ఇప్పుడు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. దీనికి సారథిగా నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కార గ్రహీత మొహమ్మద్ యూనస్ ఉన్నారు. ఈయన కూడా భారత్ కు వ్యతిరేకి. బంగ్లాదేశ్ లో భారత్ జోక్యం ఎక్కువవుతోందని విమర్శలు చేస్తుంటారు.

మళ్లీ పాక్ తో చెట్టాపట్టాల్

ఖలీదా జియా ప్రభుత్వం గతంలో పాకిస్థాన్ అనుకూల ధోరణితో ఉండేది. మొహమ్మద్ యూనస్ వచ్చాక అదే విధమైన సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా, బంగ్లాదేశ్ భాషా, కల్చర్ ను కాపాడుకోవడానికి జరిగింది స్వాతంత్ర్య పోరాటం. దీనిని దారుణంగా అణచివేసింది పాకిస్థాన్. మహిళలు, యువతలపై బంగ్లాలో అత్యాచారాలకు తెగబడింది పాక్ సైన్యం. దొరికిన యువకుల గొంతు కోసేసింది. అలాంటి దేశంతోనే ఇప్పుడు మళ్లీ బంగ్లా అధినేత మొహమ్మద్ యూనస్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగనున్నారు. పాక్ సైన్యాన్ని తమ దేశంలో శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానించారు. దీనిని గమనించిన నిపుణులు.. ఇదేం విడ్డూరం అని నిష్టూరుస్తున్నారు.

Tags:    

Similar News