మరో భారీ ఘనతను సొంతం చేసుకోనున్న భారత్.. అదేమంటే?

ఈ అంచనా భారత రిజర్వు బ్యాంక్.. ప్రభుత్వ అంచనాలకు మించి ఉండటం ఆసక్తికరంగా మారింది.

Update: 2025-01-18 05:30 GMT

ఒకటి తర్వాత మరొకటి అన్న రీతిలో విజయాల్ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతున్న భారత్.. మరో ఏడాదిలో భారీ ఘనతను సొంతం చేసుకోనుంది. 2026 నాటికి ప్రపంచంలో జపాన్ ను అధిగమించి నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ అంచనాను వాళ్లు వీళ్లు కాకుండా పరిశ్రమల సంఘం.. పీహెచ్ డీసీపీఐ అంచనా వేయటమే దీనికికారణం. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఏకానమీ 6.8 శాతంగా నమోదు కానుందని తేల్చింది. ఈ అంచనా భారత రిజర్వు బ్యాంక్.. ప్రభుత్వ అంచనాలకు మించి ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వరకు) వ్రద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందన్న అంచనా వేశారు. అమెరికా.. చైనా.. జర్మనీ.. జపాన్ ల తర్వాత భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇది కాస్తా.. తర్వాతి ఏడాదికి జపాన్ ను అధిగమించే పరిస్థితికి వస్తుందని చెబుతున్నారు.

ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2025-26 వార్షిక బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు హేమంత్ జైన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ప్రస్తుతం రూ.15 లక్షలకు పైనే ఉన్న ఆదాయానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తోంది. అయితే.. ఈ స్థాయి పన్ను రేటును రూ.40 లక్షలకు పైన ఉన్న వారికి మాత్రమే వర్తింపచేయాలి. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలంటూ పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ పన్ను మినహాయింపు మీద మధ్యతరగతి జీవులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి..నిర్మలమ్మ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News