భారత అమ్ముల పొదిలో ఆయుధం : చైనా పాక్ లకు షాక్
అయినా సరే భారత్ వీటిని పట్టించుకోకుండా తానుగా ఎదుగుతూ వస్తోంది.
భారత దేశం అంటే విషం కక్కే దేశాలు పొరుగున ఉన్నాయి. సహనంతో వ్యవహరించే భారత్ అంటే దాయాది పాక్ కి చెలగాటం గా ఉంటుంది. ఇక మరో పొరుగు దేశం చైనాకు కూడా కయ్యానికి కాలు దువ్వాలనిపిస్తుంది. అయినా సరే భారత్ వీటిని పట్టించుకోకుండా తానుగా ఎదుగుతూ వస్తోంది. ప్రపంచానికి మిత్రుడుగా మారుతూ వస్తోంది.
భారత్ గడచిన కొంతకాలంగా ప్రపంచంలో అతి ముఖ్య దేశంగా ఉంది. కరోనా సమయంలో భారత్ ప్రపంచానికి చేసిన సాయంతో భారత్ అంటే చిన్నా పెద్దా దేశాలు అనేకమైనవి అభిమానం పంచుకున్నాయి. ఇక ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికా భారత్ తన నిజమైన నేస్తం అంటోంది.
ఉక్రెయిన్ మీద తన మూడో కన్ను తెరచిన రష్యాను చూసి ఇతర దేశాలు వణికిన నాడు అదే రష్యాతో చెలిమి చేయడమే కాదు అతి సన్నిహిత మిత్రుడుగా మెలిగిన భారత్ ని చూసిన వారు దౌత్య నీతిలో భారత్ గ్రేట్ అనుకున్నారు. ఈ రోజున ఐదో అతి పెద్ద ఆర్ధిక శక్తిగా భారత ఉంది. సమీప భవిష్యత్తులో మూడవ శక్తిగా మారనుంది.
ఇక రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు గడచిన కాలంలో బాగా పెరిగాయి. భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇక భారత్ కి ఇరుగు పొరుగు దేశాల నుంచి ఇబ్బందులు ఉన్న వేళ రక్షణ రంగంలో తాను బలంగా ఉండాలని చూస్తోంది. ఆ దిశగా అనేక చర్యలను తీసుకుంటోంది.
ఇవన్నీ ఇలా ఉంచితే భారత్ రష్యా రెండు దేశాలు కలసి అభివృద్ధి చేసిన క్షిపణి పేరు బ్రహ్మోస్. ఈ క్షిపణికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే భారత్ లో ప్రవహించే బ్రహ్మపుత్ర నది అలగే రష్యాలో ని నది మోస్క్వా ల పేర్లు కలిపిన కారణంగా అని చెబుతారు.
బ్రహ్మోస్ క్షిపణి ఈ రోజున ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. ఈ క్షిపణి గొప్పదనం ఏంటి అంటే అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతుంది. ధ్వని కంటే మూడు రెట్లు వేగంగా దూసుకుని పోతుంది. ఈ వేగం కారణంగా శత్రు దేశాలు ఈ క్షిపణిని ఏ మాత్రం గుర్తించలేవు. ఈ క్షిపణి గాలిలో ఉండగానే తన విమాన మార్గాన్ని సర్దుబాటు చేసుకోగలదు.
ఒకసారి ప్రయోగించాక అప్పటి పరిస్థితులను బట్టి తన గమనంలోనే తగిన రీతిన మార్గాన్ని మార్చుకుంటూ ప్రత్యర్థిని తుత్తునియలు చేయగలరు. అలా తాను ఏ లక్ష్యానికి నిర్దేశించబడ్డానో తాను నూరు శాతం పరిపూర్తి చేయగల సత్తా బ్రహ్మోస్ క్షిపణికి ఉంది.
ఒక సారి కనుక బ్రహ్మోస్ ని శత్రువుల మీద ప్రయోగించడం అంటూ జరిగితే కచ్చితంగా అది వారి మీద దాడి చేసి వస్తుంది. అత్యాధునిక సాంకేతికతో రూపుదిద్దుకున్న బ్రహ్మోస్ క్షిపణికి ఫైర్ అండ్ ఫర్గెట్ ఫీచర్ అన్నది ఉండడం సరికొత్త టెక్నాలజీ. దీని ఆసరాతో ఒక్కసారి ప్రయోగిస్తే చాలు తదుపరి ఆదేశాలు ఏమీ ఎవరూ చెప్పకుండానే తన మార్గాన్ని అది గుర్తించి మరీ శత్రువుని మట్టుబెట్టగలదు.
అందువల్లనే చైనాకు పాక్ కి బ్రహ్మోస్ అంటే ఒక షాక్. దానికి ఈ రోజుకీ జవాబు చెప్పే సత్తా ఈ రెండు దేశాలకూ లేదు. ఇంతటి అరవీర భయంకరమైన ఆయుధం భారత్ అమ్ముల పొదిలో ఉండడంతో చైనా పాక్ వణుకుతున్నాయని రక్ష్ణ రంగ నిపుణులు చెబుతారు.
ఇక ఈ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చాలా దేశాలు ఈ క్షిపణిని భారత్ నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. పిలిప్పీన్స్ ఇప్పటికే ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. వియత్నాం కూడా కొనుగోలు చేయాలనుకుంటోంది. ఇండోనేషియా కూడా తాను రెడీ అంటోంది.
భారత్ లో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతున్న ఇండోనేసియా అధ్యక్షుడు ప్రభోవో సుభియాంటో ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఆయన బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే విషయంలో భారత్ తో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నారు అని అంటున్నారు. ఈ ఒప్పందం కనుక కుదిరితే భారత్ బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేసి ఇండోనేసియాకు రెండేళ్ళలో అందిస్తుంది అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి చైనా పాక్ లకు మాత్రం కంటికి కునుకు లేకుండా బ్రహ్మోఅస్ చేస్తోంది.